మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తులు ఉంటే.. అది నిజంగా విచిత్రమే కదా. సినిమా పుట్టినప్పటి నుంచి కొంతమంది నటుల్ని పోలినవారు చాలామంది మనకు తారసపడ్డారు. టాలీవుడ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి పోలికలతో కనిపించే నటుడు రాజ్‌కుమార్. కొన్ని సినిమాల్లో చిరంజీవి క్యారెక్టర్‌నే చేసి మెప్పించాడు కూడా. చిరంజీవిలాగే డైలాగ్స్ చెప్పడం, చిరంజీవిలాగే డాన్స్ చేయడం వంటివి అతన్ని జూనియర్ మెగాస్టార్‌ని చేశాయి. రాజ్‌కుమార్‌ను దాసరి నారాయణరావు పరిచయం చేశారు. అమ్మ రాజీనామా, డబ్బు భలే జబ్బు, వద్దు బావా తప్పు, నాగబాల, పరువు ప్రతిష్ట, సంసారాల మెకానిక్, పచ్చని సంసారం, కాలేజీ బుల్లోడు, ఎన్టీఆర్ నగర్ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ,కన్నడ సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. ఆ తర్వాత వెండి తెర నుండి బుల్లి తెరకు షిఫ్ట్ అయ్యారు. విధి, మనోయజ్ఞం, పవిత్ర బంధం వంటి సీరియల్స్‌లో నటించారు. అనంతరం కన్నడ చిత్ర సీమలో అడుగుపెట్టి సినిమాల నిర్మాణం చేపట్టారు. ఇదిలా ఉంటే.. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అత్తారింటికి దారేది’ చిత్రం వల్ల తాను 3 కోట్ల రూపాయలు నష్టపోయానని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. తాను నిర్మాతగా మారి సినిమాలు చేయడం వల్ల చాలా నష్టపోయానని, అలా కాకుండా సీరియల్స్‌లో పెట్టుబడులు పెట్టి ఉంటే ఇప్పుడు నా స్థాయి వేరేలా ఉండేదని చెబుతున్నారు.
‘ఒక తమిళ సినిమాకి రీమేక్‌గా ‘బారిస్టర్ శంకర్ నారాయణ్’ అనే సినిమాను నటిస్తూ నిర్మించాను. నేను నిర్మాతగా చిన్నవాడ్ని అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్‌తో సహా అందరూ నాకు సాయం చేశారు. 2013 సెప్టెంబర్ 21న సినిమాను రిలీజ్ చేశాం. వాస్తవానికి పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం అక్టోబర్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే అప్పటికే సగం సినిమా లీక్ అయిపోవడంతో వాళ్ళు ముందుకు వచ్చి సెప్టెంబర్ 28నే రిలీజ్ చేశారు. దీంతో ‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం నా సినిమాను థియేటర్స్ నుంచి తీసేశారు. కేవలం 17 థియేటర్లు మాత్రమే మా సినిమాకి మిగిలాయి. ఆ దెబ్బతో నేను తేరుకోలేకపోయాను. నా సినిమా థియేటర్ల నుండి తీసేయడం వల్ల రూ.3 కోట్లు నష్టపోయాను. అది నన్ను ఎంతో బాధించిన విషయం’ అంటూ తన బాధను తెలియజేశారు.