ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భిన్న‌మైన రాజ‌కీయ ప‌రిస్థితులున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ బ‌లంగా వుంది. ఇందుకు సామాజిక ప‌రిస్థితులే కార‌ణం. రాయ‌ల‌సీమ‌లో వైసీపీ బ‌లంగా వుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే రాయ‌ల‌సీమ గ‌డ్డ వైసీపీకి అడ్డా. 2014లో రాయ‌ల‌సీమ మిన‌హా ఉత్త‌రాంధ్ర‌, కోస్తా ప్రాంతాల్లో టీడీపీ హ‌వా కొన‌సాగించింది. రాయ‌ల‌సీమ‌లో మాత్రం మెజార్టీ సీట్ల‌ను వైసీపీ ద‌క్కించుకుంది.
2014లో రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి 52 సీట్ల‌కు గాను 29, టీడీపీకి 23 సీట్లు ద‌క్కాయి. 2019లో మూడు సీట్లు మిన‌హా మిగిలిన 49 చోట్ల వైసీపీకి ప‌ట్టం క‌ట్టారు. అయితే రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా కొన్ని విష‌యాల్లో వైసీపీ ప్ర‌భుత్వం న‌డుచుకోలేద‌న్న అసంతృప్త ఆ ప్రాంతంలో వుంది. తాజాగా కృష్ణా బోర్డు కార్యాల‌యాన్ని విశాఖ‌లో ఏర్పాటు చేయ‌నుండ‌డ‌మే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.
కృష్ణా న‌దితో ఎలాంటి సంబంధం లేని విశాఖ‌లో సంబంధిత బోర్డు కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో వైసీపీ ప్ర‌భుత్వం ఎందుకున్న‌దో అర్థం కావ‌డం లేదు. ఏపీ విభ‌జ‌న స‌మయంలో కృష్ణా బోర్డును ఏపీలోనూ, గోదావ‌రి బోర్డును తెలంగాణ‌లో ఏర్పాటు చేసేలా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆ రెండు కార్యాల‌యాలు ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఉన్నాయి.
కృష్ణా బోర్డు కార్యాల‌యాన్ని విశాఖ‌లో ఏర్పాటు చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో కృష్ణా బోర్డు చైర్మ‌న్ శివ్‌నంద‌న్‌కుమార్‌కు జ‌ల‌వ‌న‌రుల‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ‌శిభూష‌ణ్‌కుమార్ లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. విశాఖ‌లో సౌక‌ర్య‌వంత‌మైన భ‌వ‌నాన్ని సిద్ధం చేశామ‌ని, అక్క‌డికి త‌ర‌లించేందుకు వెంట‌నే ఆదేశాలు ఇవ్వాల‌ని ఆ లేఖ‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.
వైసీపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై సీమ ఉద్య‌మ‌కారులు మండిపడుతున్నారు. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం ఈ కార్యాల‌యాన్ని విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేయాల‌ని అనుకుంది. ఈ నిర్ణ‌యాన్ని అప్ప‌ట్లో సీమ ఉద్య‌మ‌కారులు వ్య‌తిరేకించారు. టీడీపీ ప్ర‌భుత్వం క‌నీసం కృష్ణా జ‌లాలు పారే ప్రాంతంలో బోర్డు కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌త‌ల‌పెట్టింద‌ని, ఈ ప్ర‌భుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా విశాఖ‌లో నెల‌కొల్పాల‌ని నిర్ణ‌యించ‌డం దుర్మార్గ‌మ‌ని మండిప‌డుతున్నారు.
విశాఖ‌కు, కృష్ణా జ‌లాల‌కు ఏంటి సంబంధ‌మ‌ని నిల‌దీస్తున్నారు. డిమాండ్ చేస్తున్న సీమ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను విస్మ‌రించి, విశాఖ‌లో ఏర్పాటు చేయ‌డం వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాల‌నే నిల‌దీత‌లు ముందుకొస్తున్నాయి. రాజ‌కీయంగా ఈ నిర్ణ‌యం వైసీపీకి న‌ష్టం చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.