మూడోసారి గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్, బీఫారాలు అందజేయడంలోనూ ఏ మాత్రం తగ్గడం లేదు. తెలంగాణ భవన్ లో 51 మందికి బీఫారాలు అందజేసిన కేసీఆర్, తాజాగా మరో 18 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారు. హుస్నాబాద్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. ఓటర్లకు వరాల జల్లు కురిపించారు. బహిరంగ సభ నుంచి ప్రగతిభవన్‌లో చేరుకున్న కేసీఆర్, 18 మంది పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. నాలుగైదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని ప్రకటించారు. జనగామ టికెట్ ను పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటాయించారు. పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. చివరికి పల్లా రాజేశ్వర్ రెడ్డికే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫారం అందజేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం జరుగుతోంది.

బీఫారాలు ఎవరెవరికంటే
మంత్రి జగదీశ్‌రెడ్డి, కోదాడ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌, నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌, మిర్యాలగూడ సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ములుగు అభ్యర్థిని బడే నాగజ్యోతి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌ లకు బీఫారాలు అందజేశారు. శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ, హుజురాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ కుమార్‌, తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌ లకు కేసీఆర్ బీ ఫారాలు అందజేశారు. దీంతో మొత్తం 69 మంది అభ్యర్థులకు నామినేషన్లు ఇచ్చినట్లయింది.

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
అంతకుముందు అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించారు సీఎం కేసీఆర్. మూడోసారి అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామన్నారు. అన్ని వర్గాల పరిగణనలోకి తీసుకున్నామన్న కేసీఆర్, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు దాన్ని పేదలకు పంచడమే లక్షమన్నారు. ఓటర్లకు వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి, రైతు బీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ.5లక్షల జీవిత బీమా అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా దాదాపు 93 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఆసరా పింఛను ప్రస్తుతం రూ.2,016 ఇస్తుండగా, తొలి సంవత్సరంలో రూ.3,016కు పెంచుతారు. ఏటా రూ.500ల చొప్పున ఐదేళ్లలో రూ.5,016 ఇస్తామన్నారు. దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంచుతామని, దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5వేలకు చేస్తామని, తర్వాత ఏటా రూ.300ల పెంచుకుంటూ పోతామన్నారు. ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితి ₹15లక్షలకు పెంచుతామన్న కేసీఆర్, సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తామన్నారు.

Source link
next post