New Zealand beats Afghanistan by 149 runs, AFG allout for 139
చెన్నై: చిన్న టీమ్స్ పెద్ద జట్లను ఓడిస్తున్న ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచులోనూ ఏదైనా అద్భుతం జరగబోతుందా అని ఎదురుచూసిన క్రికెట్ ప్రేమికులకు నిరాశే ఎదురైంది. ఫస్ట్ ఇన్నింగ్స్ సగం వరకు అదే జరుగుతోంది అనిపించింది. ఆ తరువాతే సీన్ రీవర్స్ అయింది. పటిష్ట న్యూజిలాండ్ విసిరిన 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక అఫ్గానిస్థాన్ టీమ్ 34.4 ఓవర్లలో కేవలం 139 పరుగులకే ఆలౌట్ అయింది. 149 పరుగుల భారీ తేడాతో నెగ్గిన కివీస్ టేబుల్ టాపర్ గా నిలిచింది. ఆడిన 4 మ్యాచ్ ల్లోనూ నెగ్గిన న్యూజిలాండ్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. కివీస్ బౌలర్లలో శాంట్నర్ 3 వికెట్లు, ఫెర్గూసన్ 3 వికెట్లతో చెలరేగారు.
తడబడిన అఫ్గాన్ బ్యాటర్లు..
289 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ ఏ దశలోనూ వికెట్లు నిలుపుకోలేదు. మొదట 27 పరుగుల వద్ద అఫ్గాన్ ఓపెనర్లు ఔటయ్యారు. హెన్రీ బౌలింగ్ లో గుర్బాజ్ (11) ఔట్ కాగానే, మరుసటి ఓవర్లో జద్రాన్ (14) ను ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన రహ్మత్ షా (62 బంతుల్లో 36 పరుగులు) పరవాలేదనిపించాడు. అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది (8)తో పాటు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాలన్ లను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్ బాట పట్టించాడు. 34వ ఓవర్లో 3 బంతికి రషీద్ ఇచ్చిన క్యాచ్ ను మిచెల్ అందుకున్నాడు. అదే ఓవర్లో 6వ బంతికి ముజీబ్ క్యాచ్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 35వ ఓవర్లో 2వ బంతికి నవీన్, 4వ బంతికి షరూఖీలను శాంట్నర్ ఔట్ చేసి అఫ్గాన్ ఇన్నింగ్స్ ముగించాడు. గత మ్యాచ్ లో ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఓడించిన అఫ్గాన్ ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్లను ఎదుర్కోలేక కేవలం 139 పరుగులకే చాపచుట్టేశారు. 4 మ్యాచ్ ల్లో ఒక్కటి నెగ్గిన అఫ్గాన్ పాయింట్ టేబుల్ లో 9వ స్థానంలో నిలిచింది.
లాథమ్ కెప్టెన్ ఇన్నింగ్స్! ఫిలిప్స్, యంగ్ హాఫ్ సెంచరీలు
చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ నెగ్గిన అఫ్గనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఓపెనర్ విల్ యంగ్ (54 రన్స్; 64 బంతుల్లో 4×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (20) త్వరగా ఔటయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ (71; 80 బంతుల్లో 4×4, 4×6), కెప్టెన్ టామ్ లాథమ్ (68; 74 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీలతో రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసి అఫ్గాన్ కు భారీ టార్గెట్ నిర్దేశించింది. అఫ్గాన్ బౌలర్లలో నవీనుల్ హక్ 2, ఒమర్‌జాయ్ 2, రషీద్ ఖాన్, ముజిబుర్ రెహ్మన్ చెరో వికెట్ తీశారు.
కివీస్ ఓపెనర్ల నుంచి జట్టుకు ఆశించిన శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ డేవాన్ కాన్వే.. అఫ్గాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మన్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో 30 పరుగులకే కివీస్ తొలివ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ విల్ యంగ్, రచిన్ రవీంద్ర నిలకడగా బ్యాటింగ్ చేయడంతో ఓ దశలో 20 ఓవర్లకు 109/1 తో పటిష్టంగా కనిపించింది. కానీ కేవలం ఒక్క పరుగు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అఫ్టాన్ పేసర్ అజ్మతుల్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 2 వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టాడు. రెండో బంతికి రచిన్ రవీంద్రను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అదే ఓవర్లో చివరి బంతికి విల్ యంగ్ క్యాచ్ ఔటయ్యాడు. మరుసటి ఓవర్లో రషీద్ బ్యాటర్ డారిల్ మిచెల్ ను పెవిలియన్ బాట పట్టించాడు. మిడ్ వికెట్ దిశగా ఆడిన బంతిని ఇబ్రహీం జద్రాన్ క్యాచ్ పట్టాడు.
మరో వికెట్ పడకుండా 4వ వికెట్ కు ఫిలిప్స్, కెప్టెన్ లాథమ్ 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 48వ ఓవర్లో నవీన్ ఉల్ హక్ షాకిచ్చాడు. క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాటర్లను ఔట్ చేశాడు. ఆ ఓవర్ తొలి బంతికి ఫిలిప్స్ ను, 3వ బంతికి కెప్టెన్ లాథమ్ ను పెవిలియన్ బాట పట్టించాడు. చివర్లో మార్క్ చాప్‌మన్ (25 నాటౌట్; 12 బంతుల్లో 2×4, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో అఫ్గాన్ ముందు భారీ లక్ష్యం నిలిపింది కివీస్.