తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 స్థానాల్లో పోటీచేయడం సాధ్యం కాదు గానీ.. ప్రస్తుతానికి 89 స్థానాల్లో పోటీచేయబోతున్నాం అని, క్రమంగా పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తాం అని తెలుగుదేశం ఆర్భాటంగా ప్రకటిస్తూ ఉంది.
ఏపీలో చంద్రబాబు పల్లకీ మోయడానికి ఉత్సాహపడుతున్న జనసేన పార్టీ తెలంగాణలో కూడా తమతో కలిసి వస్తుందేమో అని ఎదురుచూస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో అసలు తెలుగుదేశం పార్టీ బతికే ఉన్నదని అనుకోవడం ఎలాగ? అనే సందేహాలు ప్రజల్లో తలెత్తున్నాయి.
ఎందుకంటే పార్టీకి ఎంతో విధేయుడిగా, ఎంత కష్టకాలం వచ్చినా సరే.. పార్టీని వీడకుండా కొనసాగిన సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశాన్ని వీడి, భారాసలో చేరబోతుండడమే కారణం.
రావుల చంద్రశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరు 1994, 2009 లలో మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చీఫ్ విప్ గా కూడా పనిచేశారు. అయితే రాష్ట్రవిభజన తర్వాత.. తెలంగాణ వ్యాప్తంగా మసకబారిన తెలుగుదేశం ప్రతిష్టతో ఆయన కూడా ఓడిపోయారు. కానీ అప్పటినుంచి తెలుగుదేశం లోనే కొనసాగుతున్నారు.
రాష్ట్రంలో పార్టీ శల్యావశిష్టంగా మారిపోయినప్పటికీ.. ఆయన పార్టీగళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గలు స్వీకరించి.. ఈఎన్నికల్లో పార్టీని పోటీకి సిద్ధం చేస్తున్న తరుణంలో, బాలకృష్ణ కూడా రాష్ట్రవ్యాప్త ప్రచారంతో ఊపు తీసుకువస్తారని అనుకుంటున్న తరుణంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ వీడిపోవడానికి నిర్ణయించుకోవడం విశేషం.
తెలుగుదేశం నుంచి భారాసలోకి వెళ్లిన సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ లు రావులతో మాట్లాడి ఒప్పించినట్టుగా తెలుస్తోంది. రావుల పోకతో.. తెలంగాణ తెలుగుదేశంలో అంతో ఇంతో పేరున్న నాయకులు పూర్తిగా కనుమరుగయ్యారనే చెప్పాలి.
చంద్రబాబునాయుడు ఎటూ జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. బాలకృష్ణ కాదు కదా.. ఇంకా ఎందరు వచ్చి ఎన్ని జాకీలు వేసినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం తిరిగి కోలుకునే అవకాశం లేదనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది. అభిమానులు ఎవరైనా మిగిలిఉంటే.. అయ్యోపాపం తెలుగుదేశం అనుకోవాల్సిందే.
రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు.. జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా భారాసలో చేరబోతున్నారు. ఆ పార్టీలోనే యువజన విభాగం రాష్ట్ర సారథిగా పనిచేస్తూ, భువనగిరి టికెట్ దక్కలేదని అలిగి వెళ్లిపోయిన జిట్టా.. తర్వాత యువతెలంగాణ పేరిట సొంత పార్టీ, వైసీపీ, మళ్లీ సొంత పార్టీ, బిజెపి మద్దతు, బిజెపిలో చేరిక, కొన్ని వారాల కిందట కాంగ్రెసులో చేరిక వంటి అనేక గెంతులు గెంతారు. చివరికి ఇప్పుడు హరీశ్ రావు తదితరుల మంతనాలతో తిరిగి భారాస గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది.