Minister RK Roja : ఏపీలో టీడీపీ-జనసేన పొత్తుతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఉమ్మడి కార్యాచరణతో ముందు వెళ్లాలని టీడీపీ, జనసేన రాజమండ్రిలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. టీడీపీ-జనసేన కలయికపై అధికార వైసీపీ మాటల దాడి చేస్తుంది. తాజాగా మంత్రి రోజా టీడీపీ, జనసేన పొత్తు, చంద్రబాబు కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… పవన్, లోకేశ్ ఇద్దరు కలిసి రాజమండ్రిలో పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారని ఎద్దేవా చేశారు. రెండు అర సున్నలు కూర్చొని జైలులో ఉన్న గుండు సున్న కోసం చర్చించారని సెటైర్లు వేశారు. వై ఏపీ నీడ్స్ పవన్ కల్యాణ్, చంద్రబాబు అనే నినాదంతో టీడీపీ, జనసేన ప్రజల్లోకి వెళ్లే దమ్ముందా అని మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ఇక జైలు నుంచి బయటకు రారని, జీవితాంతం జైలులోనే ఉంటారన్నారు.