Nagam Janardhan Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకెళ్లినా టికెట్ పై హామీ దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దీంతో ఆగ్రహానికి గురైన నాగం, తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఆదివారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. నాగం త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈరోజు సాయంత్రం మంత్రి హరీశ్ రావు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తోంది.