ఈ ఏడాది జూలైలో చిన్న సినిమాగా విడుదలైన ‘బేబీ’ ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకుడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్‍కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ.90 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్ కి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
‘బేబీ’ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. సాయి రాజేషే ఈ రీమేక్ ని డైరెక్ట్ చేయనున్నాడట. అంతేకాదు హిందీలోనూ ఈ చిత్రాన్ని ఎస్‍కేఎన్ నిర్మించనున్నాడట. ఇప్పటికే హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసినట్లు వినికిడి.
యూట్యూబర్ అయిన వైష్ణవి చైతన్యని ‘బేబీ’తో సాయి రాజేష్ హీరోయిన్ గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ రోల్ పోషించిన వైష్ణవి తన నటనతో కట్టిపడేసి, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు హిందీలో కూడా సాయి రాజేష్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడట. నార్త్ కి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ని ఈ రీమేక్ తో హీరోయిన్ గా పరిచయం చేయనున్నట్లు సమాచారం.