Kishan Reddy: కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఆయనను సాదరంగా బీజేపీలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో అనేక రకాల అవినీతి ఆరోపణలు ఉన్న వారికి, మాఫియా వ్యవస్థలను పెంచి పోషిస్తున్న వారికి కేసీఆర్ టికెట్స్ ఇచ్చారని విమర్శించారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా, నిజాయితీగా పనిచేస్తున్న గిరిజన బిడ్డలకు టికెట్లు ఇవ్వలేదన్నారు. బుధవారం సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉందని, మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అధికార పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

మూడు నుంచి ఎన్నికల శంఖారావం
బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నవంబర్ 3 నుంచి ఉధృతం చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. అధికారమే లక్ష్యంగా ఎన్నికలకు పూర్తిగా సమాయత్తం అవుతామన్నారు. అలాగే కర్ణాటకలో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ గురించి అక్కడి రైతులు స్వయంగా తెలంగాణకు వచ్చి చెబుతున్నారని అన్నారు. ఐదు నెలల్లో కర్ణాటకలో ‘తెలంగాణ ఎలక్షన్ టాక్స్’ పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. కర్ణాటక ప్రజలు నేరుగా తెలంగాణకు వచ్చి అక్కడ జరుగుతున్న పాలన గురించి చెబుతున్నారని అన్నారు.

తెలంగాణకు పెద్ద మొత్తంలో డబ్బు
ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ కుట్రలకు తెరతీస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. చెన్నై సహా వివిధ మార్గాల ద్వారా తెలంగాణకు పెద్ద ఎత్తున డబ్బులు తరలిస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో కర్ణాటకను ఎలా దోపిడీ చేస్తుందో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని విమర్శించారు. ఇలాంటి స్థితిలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని పిలుపునిచ్చారు.

ఎవరు వెళ్లినా నష్టం లేదు..
ప్రపంచంలో బీజేపీ అతిపెద్ద పార్టీ అని కిషన్ రెడ్డి అన్నారు. ఎవరైనా పార్టీ వీడి వెళ్తే వచ్చే నష్టం లేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ దేశం కోసం పనిచేస్తుందని, కేడర్ ఆధారిత పార్టీ బీజేపీ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎవరైనా వెళ్తే తాము ఏమీ చేయలేమని చెప్పారు. జనసేనతో సీట్ల సర్దుబాటుపై అధిష్టానంతో చర్చ జరుగుతోందన్నారు. మానిఫెస్టో మీద చర్చ జరుగుతోందని, మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని చెప్పారు.

కలిసేందుకు కూడా కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు: రాథోడ్ బాపూరావు
ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాలో ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. ముగ్గురు ట్రైబల్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదన్నారు. కనీసం కలిసేందుకు ప్రయత్నించినా సరే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ పని తీరు చూశానని, అది నచ్చి బీజేపీలో చేరినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన ఈటల రాజేందర్ సహా బీజేపీలో ఉన్న నేతలందరి సాయంతో బీజేపీ విజయానికి పనిచేస్తానని అన్నారు.

సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం కేటాయించి కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు గౌరవం ఇస్తోందని అన్నారు. కేడర్ తనతోనే ఉందని, బోథ్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావును గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నానని, ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.

Source link
next post