కొంత మంది ప్ర‌శంస‌లు చాలా ప్ర‌మాద‌క‌రం. బాగు కోరేవారెవ‌రైనా త‌ప్పుల్ని ఎత్తి చూపుతుంటారు. స‌రైన మార్గంలో న‌డిపించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే రాజ‌కీయాల్లో ఒక పార్టీ అధ్య‌క్షుడు, మ‌రో పార్టీ అధ్య‌క్షుడిని ప్ర‌శంసించారంటే అనుమానించాల్సిందే. రాజ‌కీయాల్లో ఈ ధోర‌ణి ఒక పార్టీని ముంచుతుంద‌ని అనేక ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబును న‌మ్మి బాగుప‌డిన‌ట్టు తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఒక్క‌టంటే ఒక్క నిద‌ర్శ‌నం కూడా లేదు.
అదేంటో గానీ, గొర్రె క‌సాయి వాన్ని న‌మ్మిన చందంగా చంద్ర‌బాబును ప‌వ‌న్ విశ్వ‌సిస్తున్నార‌ని జ‌న‌సేన శ్రేణులే వాపోతున్న ప‌రిస్థితి. ప‌వ‌న్ రాజ‌కీయ అజ్ఞాని అని చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్ల‌లు. మ‌ధ్యంత‌ర బెయిల్‌పై చంద్ర‌బాబు విడుద‌లైన సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌…ఆయ‌న అజ్ఞానానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం. అలాగే బెయిల్‌పై విడుద‌లైన సంద‌ర్భంగా చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ ప్ర‌త్యేకంగా ప‌వ‌న్‌ను అభినందించ‌డాన్ని చూస్తే….జ‌న‌సేనాని రాజ‌కీయంగా ఖేల్ ఖ‌తం అనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది.
చంద్ర‌బాబు ఆరోగ్యాన్ని ప‌వ‌న్ కాంక్షించ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టరు. కానీ చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే ప‌వ‌న్‌లో పూన‌కం ఏదో అవ‌హిస్తున్న‌ట్టుగా వుంది. ఈ వాక్యాలు చ‌దివితే ఆ భావం క‌లుగుతుంది.
"చంద్ర‌బాబు అనుభ‌వం ఈ రాష్ట్రానికి అవ‌స‌రం. ఆయ‌న కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అంద‌రం ఆయ‌న‌కు స్వాగ‌తిద్దాం. బెయిల్ మంజూరు చేయ‌డం సంతోష‌క‌రం. ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్ర‌జాసేవ‌కు పున‌రంకితం కావాల‌ని ఆకాంక్షిద్దాం" అని ప‌వ‌న్ పేర్కొన్నారు.
ఏపీకి చంద్ర‌బాబు అనుభ‌వం అవ‌స‌ర‌మైతే, ఇక త‌మ‌రెందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌? క‌నీసం త‌న పార్టీ శ్రేణుల‌కైనా జ‌న‌సేనాని స‌మాధానం చెప్పాలి. చంద్ర‌బాబు లేదా వైఎస్ జ‌గ‌న్ ఈ రాష్ట్రానికి అవ‌స‌ర‌మైతే, ఇక మూడో ప్ర‌త్యామ్నాయం అనే దానికి అర్థం ఏముంటుంది? అలాంట‌ప్పుడు జ‌న‌సేన‌ను ఎందుకు పెట్టిన‌ట్టు? వైసీపీ ఆరోపిస్తున్న‌ట్టు కేవలం చంద్ర‌బాబు కోస‌మే ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీ పెట్టార‌ని అనుకోవాల్సి వుంటుంది. బాబు కోసం కోట్లాది మంది ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌నే అతిశ‌యోక్తి మాట‌లు ఒక పార్టీ అధ్య‌క్షుడిగా ప‌వ‌న్ నుంచి రావ‌డ‌మే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.
బ‌హుశా ప‌వ‌న్ వైఖ‌రికి చంద్ర‌బాబే ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్టున్నారు. అందుకే బెయిల్‌పై విడుద‌లైన వెంట‌నే బాబు మాట్లాడుతూ జన‌సేన పార్టీ బ‌హిరంగంగా ముందుకొచ్చి అండ‌గా నిలిచింద‌ని అన్నారు. అందుకే ప‌వ‌న్‌కు ధ‌న్య‌వాదాల‌కు బ‌దులు, మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు చెప్ప‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఒక రాజ‌కీయ పార్టీ అధ్య‌క్షుడిగా మ‌రెవ‌రూ త‌న పార్టీ ప్ర‌యోజ‌నాల‌ను టీడీపీ కోసం బ‌లిపెట్ట‌ర‌ని చంద్ర‌బాబు అంత‌రంగం ఉద్దేశం. అందుకే ప‌వ‌న్‌కు బాబు నుంచి అభినంద‌న‌లు.
చంద్ర‌బాబు అభినంద‌న‌లు అందుకున్నారంటే, రాజ‌కీయంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా న‌ష్ట‌పోయిన‌ట్టే లెక్క‌. చంద్ర‌బాబు రాజ‌కీయంగా ఏపీకి అవ‌స‌ర‌మ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌లంగా న‌మ్ముతుంటే, జ‌న‌సేన అవ‌స‌రం లేద‌ని త‌న‌కు తానుగా ప‌వ‌న్ చెప్పిన‌ట్టే. ఇలాంటి సంకేతాల్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పంపితే జ‌న‌సేన బ‌తికి బ‌ట్ట‌క‌ట్టేదెట్టా? రాజ‌కీయాలెప్పుడూ ఈ రోజు ఉన్న‌ట్టుగా రేపు ఉండ‌వు. అస‌లే చంద్ర‌బాబు అంటే ఊస‌ర‌వెల్లికి మించి రంగులు మారుస్తార‌ని, మ‌న‌క‌ళ్లెదుటే అనేక అనుభ‌వాలున్నాయి. ఈ మాత్రం కూడా ప‌సిగ‌ట్ట‌కుండా బాబుపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే ప‌వ‌న్‌ను సొంత వాళ్లు కూడా అస‌హ్యించుకునే రోజు మ‌రెంతో కాలంలో లేదు.
ఎందుకంటే బాబు అంటే ఆయ‌న సామాజిక వ‌ర్గం త‌ప్ప‌, మిగిలిన వాళ్లంతా అస‌హ‌నంతో ఉన్నారు. ప్ర‌జాభిప్రాయానికి విరుద్ధంగా ప‌వ‌న్ రాజ‌కీయ పంథా సాగుతోంది. బాబు కోసం ప‌వ‌న్ త‌నకు తానుగా రాజ‌కీయంగా ఆత్మార్ప‌ణం చేసుకుంటున్నార‌నేందుకు బాబు అభినంద‌న‌లు, అలాగే టీడీపీ అధినేత‌పై జ‌న‌సేనాని ప్ర‌శంస‌లే నిద‌ర్శ‌నం.