వామపక్షలతో పొత్తు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాన్చుతూనే ఉంది. ఇదిగో అదిగో అంటుందే తప్ప… క్లారిటీ ఇవ్వడంలేదు. దీంతో కమ్యూనిస్టు పార్టీల నేతలు కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఫైరయ్యారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరును ట్విట్టర్ వేదిగా ప్రశ్నించారు. నిచ్చితార్ధం అయ్యాక ఇంకో అందమైన అమ్మాయి గాని… అబ్బాయిగాని దొరికితే లాగేసుకుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగవచ్చేమో గానీ…. వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాల్లో కూడా అలాగే జరిగితే ఎలా అంటూ ట్వీట్ చేశారు సీపీఐ నారాయణ.
కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరుతున్న నాయకులకు… వామపక్షాలకు ఇస్తామన్న సీట్లను కేటాయిస్తున్నారన్న వార్తలతో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ విధంగా ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. పొత్తులపై కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంటోందని… నిన్న సీపీఐ, సీపీఎం సుదీర్ఘంగా చర్చలు జరిపాయి. పొత్తు ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ రెండు సీట్లు ఇస్తామని చెప్పిందని… ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. మార్పులు ఉంటే… చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీలో చేరికలపై కూడా ఆయన స్పందించారు. తమకు ఇస్తామన్న స్థానాల్లో కొత్తవారికి ఎందుకు చేర్చుకుంటున్నారో… తెలియదన్నారు కూనంనేని సాంబశివరావు.
సీపీఎం కూడా నిన్న (బుధవారం) సుదీర్ఘంగా చర్చలు జరిపింది. పొత్తులపై కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో.. ఇస్తామన్న స్థానాలపై క్లారిటీ ఇవ్వకపోవడంతో.. ఒంటరిగా పోటీ చేసే విషయంపై నిన్న ఓటింగ్ నిర్వహించినట్టు సమాచారం. అయితే…. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి భట్టి విక్రమార్క ఫోన్ చేసి తొందరపడవద్దని చెప్పారట. ఇవాళ (గురువారం) మధ్యాహ్నం వరకు వేచిచూడమని సూచించారట. ఇవాళ పొత్తులపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వకపోతే… ఒంటరిగా బరిలోకి దిగేందుకు సీపీఎం నిర్ణయించుకుంది. అభ్యర్థుల ప్రకటనకు కూడా సిద్ధంగా ఉన్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రకటించారు.
పొత్తు ఒప్పందంలో భాగంగా… సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా ఇస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చిందట. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా సీట్లను వామపక్షాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని సమాచారం. పొత్తు కుదిరినా… వామపక్షాలు అడిగిన అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. దీంతో వామపక్ష నేతలు.. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇస్తానన్న సీట్లు ఇవ్వకపోతే… ఏం చేయాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే… సీపీఐ, సీపీఎం కలిసి పోటీచేస్తాయా…? ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీచేస్తారు అన్న అంశంపై కూడా చర్చలు జరుపుతున్నాయి సీపీఐ, సీపీఎం.