అయోధ్యలోని భవ్య రామమందిరంలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చివరి దశకు చేరనున్నాయి. మరో 5 రోజుల్లో జరగనున్న ఈ అద్భుత ఘట్టం కోసం కోట్లాదిమంది ఎదురుచూస్తున్నారు. వివిధ రూపాల్లో తమ భక్తిని చాటుకుంటున్నారు.
మొన్నటికిమొన్న ధర్మవరంకు చెందిన ఓ చేనేత కార్మికుడు, సీతమ్మవారి కోసం 4 నెలల పాటు శ్రమించి, లక్షన్నర రూపాయల ఖర్చుతో పట్టుచీర తయారుచేశారు. ఇప్పుడు మరో వ్యక్తి అయోధ్య రాముడి కోసం భారీ లడ్డూను తయారుచేశాడు.
హైదరాబాద్ కు చెందిన నాగభూషణ్ రెడ్డి, భారీ లడ్డూను తయారుచేసి రాముడిపై తన భక్తిని చాటుకున్నారు. ఈ లడ్డూ బరువు అక్షరాలా 1265 కిలోలు. అయోధ్యలో భూమి పూజ జరిగిన రోజు నుంచి రోజుకు కిలో చొప్పున లెక్కకట్టి, ఒకేసారి ఇలా భారీ లడ్డూను తయారుచేశారు నాగభూషణ్.
ఈరోజు హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఈ లడ్డూ ప్రయాణం మొదలైంది. దీనికోసం గాజుతో ప్రత్యేకంగా భారీ రిఫ్రిజిరేటర్ ను తయారుచేశారు. ఈ లడ్డూను చేసేందుకు 30 మంది 24 గంటల పాటు ఏకథాటిగా శ్రమించారు. ప్రాణప్రతిష్ట సమయానికి ఈ లడ్డూను అయోధ్య చేర్చాలనేది ప్రణాళిక.
హేమమాలిని నృత్యం.. భవ్య రామమందిరం ప్రారంభోత్సవాలు నిన్నట్నుంచి ఘనంగా మొదలయ్యాయి. ఇప్పటికే ప్రధాన ఆలయం సంప్రోక్షణ పూర్తయింది. వేలాది అర్చకులు, 2 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆలయ ప్రాంగణంలో నటి, నృత్యకళాకారిణి హేమమాలిని ప్రదర్శన ఇవ్వబోతున్నారు. 75 ఏళ్ల హేమమాలిని సీత పాత్రను ధరించి, రామాయణాన్ని నృత్యరూపకంలో ప్రదర్శించబోతున్నారు. ఆమె అయోధ్యను సందర్శించడం ఇదే తొలిసారి.
3 అంతస్తుల్లో రామాలయాన్ని సుందరంగా నిర్మించారు. ఆలయంలో 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. నగర శైలిలో నిర్మించిన ఈ మందిరం మధ్యలో రాముడి విగ్రహానికి 22వ తేదీన ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు. దీనికి సంబంధించిన క్రతువులు నిన్నట్నుంచే మొదలయ్యాయి.
రాముడి దర్బార్ ను మొదటి అంతస్తులో ఏర్పాటుచేశారు. దీంతో పాటు 5 మండపాలు నిర్మించారు. వీటికి నృత్య మండపం, రంగ మండపం, సబా మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం అని పేర్లు పెట్టారు.
దాదాపు 8వేల మంది ఆహుతులు రానున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ఆయన ప్రసంగం ప్రారంభమై, 20 నిమిషాల్లో ముగియనుంది. ప్రత్యేక ఆహ్వానితులందరికీ, భూమి పూజ కోసం అయోధ్యలో త్రవ్విన మట్టిని అందించబోతున్నారు. దీంతోపాటు వివిధ రకాల ప్రసాదాలతో కూడిన బాక్స్ ను అందిస్తారు.