మనిషికి వినోదం అనేది ఎంతో అవసరం. ఎవరికి అందుబాటులో ఉన్న సాధనంతో వారు తమకు కావాల్సిన వినోదాన్ని పొందుతూ ఉంటారు. నాటక రంగం తర్వాత ఒకప్పుడు సినిమాయే ప్రదాన వినోద సాధనంగా మారింది. కాలక్రమేణా అనేక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో సినిమాకి ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. టీవీలో, మొబైల్స్‌లో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పొందుతున్నారు. అయితే వారిని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్‌కి రప్పించాలన్న పట్టుదలతో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో సినిమాలను రూపొందిస్తున్నారు ఈతరం దర్శకులు. వారి ప్రయత్నం ఫలించినప్పటికీ కేవలం మూడు నాలుగు వారాలు మాత్రమే థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ నాలుగు వారాల్లోనే ఆయా సినిమాలకు లాభాలు వచ్చాయా, నష్టాలు వచ్చాయా అనేది లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది.
ఇదిలా ఉంటే.. సినిమాకు, థియేటర్లకు పెద్ద ప్రమాదకారిగా అవతరించింది ఓటీటీ. ఒక భారీ సినిమాను నిర్మించిన నిర్మాతకు థియేట్రికల్ బిజినెస్ ఎంత ముఖ్యమో, డిజిటల్ బిజినెస్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఓటీటీ సంస్థలు సినిమాలను, ఆయా నిర్మాతలను కమాండిరగ్ చేసే పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి వారికి కావాల్సిన విధంగా ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తూ నిర్మాతలతో అగ్రిమెంట్స్ చేయించుకుంటున్నారు. దాని ప్రకారం సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాల్లో ఆయా సినిమాలను ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అందుకే నాలుగు వారాలు పూర్తి కాగానే ఎంత పెద్ద సినిమానైనా ఓటీటీలో వేసేస్తున్నారు.
తాజాగా ‘సలార్’ చిత్రాన్నే తీసుకుంటే డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయింది. రూ.700 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ఫర్వాలేదనిపించింది. సంక్రాంతి సినిమాల హడావిడి మొదలైన తర్వాత ‘సలార్’ను థియేటర్ల నుంచి తప్పించారు. ఒకవిధంగా సలార్ హవా థియేటర్లలో లేనట్టే. ఈ సినిమాకి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు వారాల్లో స్ట్రీమింగ్ చేయాలి. దాని కోసమే సిద్ధంగా ఉన్నట్టు నెట్‌ఫ్లిక్స్ సంస్థ జనవరి 19 అర్థరాత్రి నుంచి ‘సలార్’ స్ట్రీమింగ్‌ను స్టార్ట్ చేయబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడిరది. ఇప్పటివరకు ఏ సినిమాకీ రాని వ్యూస్ ‘సలార్’కి వస్తాయని నెట్‌ఫ్లిక్స్ ఎంతో నమ్మకంగా ఉంది.
సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం పట్ల బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో టిక్కెట్స్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు తెచ్చుకొని బిజినెస్ చేసిన తర్వాత నాలుగు వారాల్లోనే సినిమాను స్ట్రీమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా నాలుగు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుందంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవచ్చు. దానివల్ల థియేటర్‌కి వచ్చే కలెక్షన్ల మీద అది ప్రభావం చూపిస్తుంది. ఈ విషయంలో నిర్మాతలు కూడా ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని కొందరు బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.