Ayodhya Prana Pratista : అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కోట్ల మంది భారతీయులు ఎదురుచూస్తున్న శుభఘడియలు సమీపిస్తున్నాయి. 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్బంగా… తెలంగాణ ప్రభుత్వం (Telangana Goveranment) సెలవు ప్రకటించాలని బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay Kumar ) కోరారు. ఈ నెల 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర పున:ప్రతిష్ట కోసం…యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్నారు. ఆ రోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి, పవిత్రమైన దైవ కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు.
సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన సంజయ్
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో ప్రసిద్ది చెందిన సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ పండితులు బండికి ఆశీస్సులు అందజేశారు. చీపురు, పార బట్టి సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఆయనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, పార్టీ కార్యకర్తలంతా ఆలయ పరిసరాల్లోని పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రధాన మంత్రి మోడీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాల శుద్ది చేస్తున్నామని బండి సంజయ్ వెల్లడించారు. ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయ పరిసరాలను శుద్ది చేయడం సంతోషంగా ఉందన్నారు.
నిధి సేకరణలో తెలంగాణదే అగ్రస్థానం
అయోధ్యలో అందాల రాముడు, అయోధ్య రాముడు, ఆదర్శ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్నారు బండి సంజయ్. తెలంగాణ ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు 22న సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొంటున్నారని తెలిపారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో తెలంగాణ రాష్ట్ర అగ్రస్థానంలో ఉందన్నారు.
కాంగ్రెస్ నేతలకు బండి సంజయ్ కౌంటర్
అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు. అక్షింతల్లో రేషన్ బియ్యం, బాసుమతి బియ్యం, జై శ్రీరాం బియ్యం అనే రకాలు ఉండవన్నారు బండి సంజయ్. పవిత్రమైన దేవుడి అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు వక్రీకరించడం మంచి పద్దతికాదన్నారు. కాంగ్రెస్ నేతలు కోరితే బాసుమతి బియ్యాన్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
23 నుంచి భక్తులకు అనుమతి
ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట వరకు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి నిరాకరించారు. 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్టు ప్రకటించింది. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్ రాణికి కూడా ఆహ్వానం పంపారు.
అమెరికా, బ్రిటన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఫిన్‌లాండ్, హాంకాంగ్, కెనడా, ఇటలీ, ఐర్లాండ్, మెక్సికో, న్యూజిలాండ్ సహా మెుత్తం 55 దేశాలకు చెందిన ప్రతినిథులు హాజరుకానున్నారు. జనవరి 20న లక్నో చేరుకోనున్న విదేశీ అతిథులు…ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు అవుతారు
Telangana government should declare January22 as holiday inview of Ram Mandir Pran Pratishta which is a holy day and once in a lifetime event for all Hindu brothers and sisters. pic.twitter.com/akBZQqBhY8
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 19, 2024