Shri Ram Janmabhoomi Teerth Kshetra: హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం (Ram Mandir) ప్రారంభోత్సవం కోసం కోట్లాది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ భారీ వేడుకలకు రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కు శ్రీరామ జన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున ఆహ్వానం పంపించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.
అయోధ్యలో రాముడి పున:ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కూడా ఆహ్వాన పత్రం పంపించారు. అయితే, ఆయనకు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చేతి కర్ర సాయంతో నడక మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కల్యాణ్ తో పాటు చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా దేశం లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు, సీనియర్ నేతలకు, అలానే వివిధ రంగాల ప్రముఖులకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానం పంపుతున్నారు. ఇక ఇప్పటికే జనవరి 22 వ తేదీ జరగనున్న రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు పారరంభమైయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా అయోధ్య రామునికి వివిధ రూపాలలో సేవలు అందుతున్నాయి.