పాకిస్థాన్ జట్టు(Pakistan Cricket team).. .ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీదు. ఒక మ్యాచ్‌లో తమకంటే ఎంతో పటిష్టమైన జట్టును మట్టికరిపించి అగ్రశ్రేణి జట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత పసికూన చేతిలో ఘోరంగా ఓడిపోతుంది. తమదైన రోజున ప్రత్యర్థి ఎంత పటిష్టంగా ఉన్న ఓడించి తీరుతుంది. ఆ తర్వాతే చిన్నజట్టు చేతిలో చతికిలపడుతుంది. ఇప్పుడు పాక్ జట్టు పూర్తి నైరాశ్యంలో కూరుకుపోయే పరిస్థితి తలెత్తింది. వరుస ఓటములతో పాకిస్తాన్ జట్టు తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. వన్డే వరల్డ్‌కప్(One day World cup) లో ఓటమి నేపథ్యంలో బాబార్ ఆజమ్ పాక్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయగా… పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించింది. అయినా పాక్ జట్టు తలరాత మారలేదు. పాక్ జట్టు గత 76 రోజులుగా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. నవంబర్ నాలుగున చివరిసారిగా మ్యాచ్ గెలిచిన పాక్…మళ్లీ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు. పాక్‌లో విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వేళ.. ఇప్పుడు ముగ్గురు సిబ్బంది రాజీనామా చేయడం సంచలనం రేపుతోంది.
పాపం పాక్…
పాకిస్థాన్ కెప్టెన్సీ పదవికి బాబర్‌రాజీనామా చేసిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూడు ఫార్మట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది. తొలుత షాన్ మసూద్ సారథ్యంలోని పాక్ టెస్ట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు.. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. ఒక్క మ్యాచ్‌ను డ్రా కూడా చేసుకోలేదు. దీంతో ఈ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని పాక్ టీ20 జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. అయిదు మ్యాచుల టీ 20 సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఈ నాలుగు మ్యాచుల్లోనూ పాక్ జట్టు ఓడిపోయింది. వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన తర్వాత పాకిస్తాన్ 8 మ్యాచ్‌లు ఆడింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓడిన పాక్.. ఆ తర్వాత కొద్దిరోజుల విరామం అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన పాక్.. అక్కడ మూడు టెస్టులలోనూ క్లీన్ స్వీప్‌ను మూటగట్టుకుంది. తాజాగా న్యూజిలాండ్‌తోనూ (0-4) పరాభవాల పరంపర కొనసాగించింది.
అయ్యో అనేలా వైఫల్యాలు…
ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చూసి ఆ దేశ మాజీలతో పాటు క్రికెట్ అభిమానులు కూడా నివ్వెరపోతున్నారు. స్వింగ్ బౌలర్లకు పెట్టింది పేరైన పాకిస్తాన్.. దారుణంగా విఫలమవుతుండటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబర్ హయాంలో అయినా జట్టులో కొంత పోరాటపటిమ ఉండేదని, ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందని, ఒక్క విజయం కోసం సుమారు రెండున్నర నెలలుగా ఎదురుచూడటం పాక్ అభిమానులకు ఆగ్రహంతో పాటు జాలి కూడా తెప్పిస్తోంది. బాబార్ ఆజమ్ పాక్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో పీసీబీ మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించింది. అయినా పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఓవైపు వరుస వైఫల్యాలు వెంటాడుతుంటే మరోవైపు ప్రపంచకప్‌లో పాక్ క్రికెట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మికీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుట్టిక్ రాజీనామా చేశారు. పీసీబీ వారి రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొంది.