KTR Demands 200 units Free Power in State: హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత కరెంట్ హామీని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా 200 యూనిట్ల కరెంట్ బిల్లులు మాఫీ చేయాలన్నారు. జనవరి నుంచి కరెంట్ బిల్లులు కట్టవొద్దని తెలంగాణ ప్రజలకు తాను సూచించగా.. తనది విధ్వంసకర మనస్తత్వం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కామెంట్ చేశారు. దాంతో కేటీఆర్ మరోసారి ఇదే అంశంపై ట్విట్టర్‌లో స్పందించారు.
తాము అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల వరకు అక్కాచెల్లెమ్మలు కరెంట్ బిల్లు చెల్లించనవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ మేరకు రేవంత్, కోమటిరెడ్డి కరెంట్ బిల్లులపై మాట్లాడిన వీడియోలను రీషేర్ చేశారు. కరెంట్ బిల్లులు కట్టే బాధ్యతను సోనియా గాంధీ తీసుకుంటారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. కనుక తక్షణమే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే కరెంట్ బిల్లులను 10 జన్‌పథ్ (సోనియా గాంధీ) నివాసానికి పంపించే కార్యక్రమానికి తాము శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
Dear @Bhatti_Mallu Garu,
I was merely reminding & referring to the statements made by CM Revanth Reddy Garu and Minister Venkat Reddy Garu
They both had asked people of Telangana to STOP paying their electricity Bills from November/December 2023 onwards
Also the CM had… https://t.co/gIZ1NIi0cg
— KTR (@KTRBRS) January 21, 2024
వీడియోలో ఏముందంటే..
‘బస్తీలలో అక్కాచెల్లెమ్మలు కరెంట్ బిల్లులతో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లు సంపాదించిన రెక్కల కష్టమంతా కరెంట్ బిల్లులకే పోతుంది. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల కరెంట్ బిల్లులు సోనియమ్మ కడతారు. ఎవరూ ఈ యూనిట్లలోపు ఉన్నవారు కరెంట్ బిల్లులు కట్టొద్దని’ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా కేటీఆర్ షేర్ చేసిన వీడియోలో ఉంది.
పేదవాళ్ల కోసం 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లులు కట్టొద్దుని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. ఎవరినైనా బిల్లులు కట్టాలని అడిగితే తన పేరు చెప్పాలని ప్రజలతో అన్నారు. మూడో తారీఖు తాము అధికారంలోకి వచ్చాక కరెంట్ బిల్లులు ఎవరూ కట్టాల్సిన అవసరం లేదని చెప్పినట్లు వీడియోలో ఉంది.
రెండున్నర దశాబ్దాలుగా పార్టీ నిలబడిందని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజలపక్షమేనని KTR స్పష్టం చేశారు. జనవరి నెల కరెంటు బిల్లులను ఎవరూ కట్టవద్దని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకమైన గృహజ్యోతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి ద్వారా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలన్నారు. హామీలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ కు బీజేపీతో ఏరోజూ పొత్తు లేదన్న కేటీఆర్.. భవిష్యత్ లోనూ ఉండదన్నారు.