Ayodhya Ram Mandir: అయోధ్య వేదికగా అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం కోసం.. ఇప్పటికే ట్రస్టు సుమారు 7 వేల మందికిపై ఆహ్వానాలు పంపింది. అతిథుల రాకతో అయోధ్య పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడా ప్రముఖుల్లో ఆహ్వానాలు అందుకున్న వారు సైతం అయోధ్యకు తరలివచ్చారు. క్రికెటర్లు సచిన్(Sachin Tendulkar), అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మిథాలీరాజ్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తదితరులు ఈ అద్భుతమైన, అపురూపమైన కార్యక్రమానికి హాజరయ్యారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సాంప్రదాయ దుస్తుల్లో ఈ మహా వేడుకకు హాజరవ్వగా… అభిమానులు సెల్ఫీల కోసం క్యూ కట్టారు.
వైభవంగా రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక
500 ఏళ్ల ఎదురు చూపులకు తెరపడిందన్న ఉద్విగ్న క్షణాల మధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక వైభవంగా పూర్తైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహించారు. వేదమంత్రోఛ్చారణల మధ్య ఈ ఘట్టం పూర్తైంది. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన స్క్రీన్స్‌లో ప్రాణ ప్రతిష్ఠ తంతుని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రధాని మోదీతో పాటు 14 జంటలు ఈ క్రతువులో పాల్గొన్నాయి. ఈ ముహూర్తాన ఆలయ ప్రాంగణంతో పాటు అయోధ్య అంతా జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది.
ప్రాణ ప్రతిష్ఠ పూర్తైన నేపథ్యంలో ప్రధాని మోదీ 11 రోజుల అనుష్ఠాన దీక్షని విరమించారు. అయోధ్య రాముడు గర్భ గుడిలో కొలువు దీరేంత వరకూ అత్యంత నిష్ఠగా ఉంటానని జనవరి 12వ తేదీన ప్రకటించారు మోదీ. అప్పటి నుంచి అదే నిష్ఠను కొనసాగిస్తున్నారు. ఇవాళ (జనవరి 22) ప్రాణ ప్రతిష్ఠ ముగిసింది. ఆ తరవాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నారు. ఆ సమయంలోనే తీర్థం తీసుకుని తన కఠిన దీక్షని విరమించారు.
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసిన తరవాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. ఈ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు కోసం ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూశామని, ఇన్నాళ్లకు ఈ కల సాకారమైందని అన్నారు. ఎన్నో శతాబ్దాల తరవాత అయోధ్యకు రాముడు వచ్చాడని అన్నారు. ఇకపై రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. శ్రీరామ చంద్రమూర్తి జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ఆద్యంతం ఎమోషనల్‌గా మాట్లాడారు. జనవరి 22 అనేది కేవలం క్యాలెండర్‌లో ఓ తేదీ కాదని, నవశకానికి ప్రారంభం అని వెల్లడించారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ తనకు అలౌకిక ఆనందాన్నిస్తోందని అన్నారు.