కుటుంబం పేరిట వైట్ రేష‌న్ కార్డు క‌లిగిన ఒక అభ్య‌ర్థి రేప‌టి ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌బోతున్నారు.
ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం అంటే అది మినిమం వంద కోట్ల వ్య‌వ‌హారంగా మారిన ప‌రిణామాల నేఫ‌థ్యంలో.. మ‌డ‌కశిర ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఒక వైట్ రేష‌న్ కార్డు హోల్డ‌ర్ అభ్య‌ర్థిగా ఖ‌రారు అయిన‌ట్టే. ఆయ‌న పేరు ఈర ల‌క్క‌ప్ప‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌ల విడుద‌ల చేసిన జాబితాలో ఆయ‌న పేరు ఉంది. నియోజ‌క‌వ‌ర్గం ఆవ‌ల అత‌డెవ‌రో కూడా తెలియ‌ని అభ్య‌ర్థి అక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌బోతున్నారు.
మ‌రి ఆయ‌న బ‌లం ఏమిటి అంటే, వివిధ పంచాయ‌తీ ప్రెసిడెంట్లు ఈర ల‌క్క‌ప్ప పేరును ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ప్ర‌పోజ్ చేస్తూ తీర్మానాలు చేయ‌డ‌మేన‌ని తెలుస్తోంది. మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో ర‌ఘువీరారెడ్డి ప్రాతినిధ్యం వ‌హించారు.
క‌ర్ణాట‌క‌- ఏపీ స‌రిహ‌ద్దుల్లోని ఈ నియోజ‌క‌వ‌ర్గం 2009లో ఎస్సీ రిజ‌ర్వ్డ్ గా మారింది. ప్ర‌స్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో.. పార్టీ జెండాను భుజాన మోసే ఒక సాధార‌ణ ద‌ళితుడిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ!
గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర‌కు ఎంపీ సీటుకు అతి సాధార‌ణ నేప‌థ్యం ఉన్న అభ్య‌ర్థిని బ‌రిలోకి దించింది. అయితే ఆమె కుటుంబానికి గ‌తంలో రాజ‌కీయ నేప‌థ్యం ఉంది. ఈర ల‌క్క‌ప్ప ఆవిర్భావం ద‌గ్గ‌ర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయ‌డ‌మే త‌ప్ప అంత‌కు మించి మ‌రే నేప‌థ్యం లేని వ్య‌క్తి. పార్టీ కార్య‌క‌ర్త‌లు, పంచాయ‌తీ ప్రెసిడెంట్లు ప్ర‌పోజ్ చేసిన వ్య‌క్తి పేరును అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.
ఏనాడూ సీఎం జ‌గ‌న్ ను డైరెక్టుగా వెళ్లి క‌లిసింది కూడా లేదట స‌ద‌రు ఈర ల‌క్క‌ప్ప‌! కేవ‌లం మ‌డ‌క‌శిర‌లోనే కాదు, శింగ‌న‌మ‌ల‌లో కూడా ఒక సామాన్య కార్య‌క‌ర్త‌ను అభ్య‌ర్థిగా ఎంపిక చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.