ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ప్ర‌స్తుతం వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకున్న వెంట‌నే ఆమె వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. మీడియా అటెన్ష‌న్ కోసం సీఎం జ‌గ‌న్‌ను వెట‌క‌రిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప‌ది తిట్లు తిట్టాక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని ఒక్క మాటైనా అన‌క‌పోతే, మ్యాచ్ ఫిక్సింగ్ బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఆమె జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.
ఈ నేప‌థ్యంలో వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌క నాయ‌కుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దుష్ట శ‌క్తుల ట్రాప్‌లో ష‌ర్మిల ప‌డ్డార‌న్నారు. అందుకే ఆమెను చూస్తుంటే జాలేస్తోందని మిథున్‌రెడ్డి వాపోయారు. చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో ష‌ర్మిల న‌డుస్తున్నార‌ని మిథున్‌రెడ్డి విమ‌ర్శించారు.
ఈ నెల 30న ఏలూరులో ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌భ నిర్వ‌హిస్తున్న‌ట్టు ఆయన చెప్పారు. ఈ స‌భ‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ హాజ‌ర‌వుతార‌ని ఆయ‌న తెలిపారు. ఏలూరు స‌భ‌కు ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌తో పాటు కృష్ణా జిల్లా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌వుతార‌ని ఆయ‌న తెలిపారు.
వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేస్తార‌ని ఆయ‌న చెప్పారు. ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల పార్టీ బాధ్య‌త‌ల్ని మిథున్‌రెడ్డి చూస్తున్నారు. అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ ఆయ‌న క్రియాశీల‌క పాత్ర పోషిస్తున్నారు.