పైలెట్ కొంగలు పరిస్థితి పసిగట్టాయా?గడిచిన ఐదు దశాబ్దాలుగా ఈ చింతపల్లి గ్రామం సైబీరియా కొంగలకు ఆవాసాన్ని కల్పిస్తోంది. తొలుత డిసెంబర్ నెలలోనే కొన్ని కొంగలు ఈ గ్రామ పరిసరాలకు చేరుకుని ఇక్కడి అనుకూలతలు, ప్రతికూలతలను చూసుకుని వెళ్లేవి. ఎప్పట్లాగా వీటి ఆవాసానికి డోకాలేదని భావిస్తే అవి మిగతా కొంగలకు గ్రీన్ సిగ్నల్ అందించేవి. ముందుగా వచ్చేవి కాబట్టి వీటిని పైలెట్ కొంగలు అని కూడా సంబోధించేవారు. ఇక ఆ తర్వాత గుంపులు, గుంపులుగా సైబీరియా కొంగలు కొన్ని వేల సంఖ్యలో ఈ పల్లెకు నేరుకునేవి. వచ్చీరాగానే చింత చెట్ల చిటారు కొమ్మలను వెతుక్కుని ఆ కొమ్మల్లో గూళ్లను ఏర్పాటు చేసుకుని అవాసానికి సిద్ధం చేసుకుంటాయి. ఇలా వచ్చిన కొంగలు ప్రతి రోజూ ఆహారం వేటకు సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లివచ్చేవి. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ తో పాటు ఇక్కడికి సమీపంలో ఉండే పెద్ద చెరువుల్లో చేపల వేటకు వెళ్లేవి. ఇలా నివసిస్తూ ఆ గూళ్లలో గుడ్లను పెట్టి పొదిగేవి. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకూ వాటి అలనాపాలనా చూసుకుంటూ నివశించేవి. తొలకరి వర్షాలు పడే సమయం వరకూ అంటే జూన్ ప్రవేశం వరకు ఉండి ఆ తర్వాత వాటి పిల్లలతో కలిసి సైబీరియాకు బయలుదేరి వెళ్లేవి. ఇలా ప్రతీ ఏటా వచ్చి వెళ్లే కొంగలు ఈ గ్రామ ప్రజల జీవితాల్లో ఒక భాగంగా మారాయి. ఇవి వస్తే గ్రామానికి శుభం జరుగుతుందని, రాని సంవత్సరాల్లో కరువు కాటకాలు తాండవించి అశుభం కలుగుతుందని విశ్వసించేవారు.
Source link