Seniours comments about Team india after Embarrassing Defeat To England: హైదరాబాద్(Hyderabad) వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా(Team India)కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు అనూహ్య ఓటమిని చవి చూసింది. భారత జట్టు 28 పరుగుల తేడాతో తొలి టెస్టులో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టామ్ హార్టీలీ ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించి బ్రిటీష్ జట్టుకు అపూరూపమైన విజయాన్ని అందించాడు. భారత జట్టు ఓటమితో రోహిత్ సేన ఆటతీరుపై మాజీలు మండిపడ్డారు. ఇదేం ఆటతీరంటూ విమర్శలు గుప్పించారు.
మరీ ఇంత డిఫెన్సీవ్‌గానా…
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడిందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik) విమర్శించాడు. పోప్ వంటి బ్యాటర్ విషయంలో డిఫెన్సివ్‌గా ఉండటంలో తప్పులేదని.. కానీ.. టామ్ హార్లీ వంటి టెయిలెండర్ల విషయంలోనూ అదే తరహాలో ఆడటం సరికాదన్నాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్ చేసి ఉంటే బాగుండేదన్న డీకే… టీమిండియా ఆటతీరు విస్మయానికి గురి చేసిందన్నాడు. సొంతగడ్డపై టీమిండియా ఇంతకు ముందెన్నడూ ఇంత బేలగా చూడలేదని రవిశాస్త్రి(Ravi Shastri) అన్నాడు. రోహిత్ సేన పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోవడం.. థర్డ్ ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టుకు 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఇవ్వడం తనని ఆశ్చర్యపరిచిందని అన్నాడు. భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆడుతుంది అసలు మనవాళ్లేనా అన్న సందేహం కలిగిందని కూడా అన్నాడు.
రెండో టెస్ట్‌కు జడేజా దూరం!
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైన టీమిండియాకు మరో షాక్ తగిలే అవకాశం ఉందన్న వార్తలు సంచలనంగా మారాయి. తొలి టెస్ట్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)… గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తొలి టెస్ట్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడని తెలుస్తుంది. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పరుగు పూర్తి చేసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతను రనౌట్ కావడమే కాకుండా రెండో టెస్ట్‌కు అనుమానాస్పదంగా మారాడు. జడేజా గాయం తీవ్రతపై ఇవాళ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నిన్న మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై ఎదురైన ప్రశ్నల గురించి స్పందించేందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ నిరాకరించాడు. విశాఖ వేదికగా రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా నిన్ననే విశాఖకు తరలివెళ్లింది.
అనేక ప్రశ్నలు..?
హైదరాబాద్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓటమి..అనేక ప్రశ్నలను లేవనెత్తింది. బ్రిటీష్ జట్టును స్పిన్‌తో చుట్టేదామనుకున్న రోహిత్ సేన పన్నిన వ్యూహం మనకే ఎదురు తిరిగింది. బాగా తెలిసిన పిచ్‌పై భారత బ్యాటర్లు చేతులెత్తేయగా.. ఇంగ్లాండ్ బ్యాటర్ పోప్.. పోరాటం అబ్బురపరిచింది. ఒంటరి పోరాటం చేసి మరీ పోప్ ఇంగ్లాండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. మరీ రక్షణాత్మక ధోరణిలో ఆడడమే భారత జట్టు ఓటమికి ప్రధాన కారణమన్న విశ్లేషణలు వినిపిస్తన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్ల ఆట గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోప్ అడ్డుగోడగా నిలబడ్డ చోట టీమిండియా బ్యాటర్లు అడ్డంగా చేతులెత్తేశారు. ఒక్క బ్యాటర్ పట్టుమని అర్ధ సెంచరీ కూడా సాధించనేలేదు. టీమిండియా పూర్తిగా డిఫెన్సీవ్ మోడ్‌లోకి వెళ్లగా ఇంగ్లండ్ టీంలో ఆ డిఫెన్సివ్ మోడ్ కనిపించలేదు.