టెట్ అర్హతలు
ఏపీలో చివరిగా 2018లో డీఎస్సీ నిర్వహించారు. అప్పుడు మొత్తం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 6.08 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మరోవైపు టెట్ రాసే అభ్యర్థుల అర్హతలపై కీలక ఉత్తర్వులను ఇచ్చింది ఏపీ సర్కార్. గతంలో ఉన్న పలు నిబంధనలను మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 5 వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే టెట్-1 పేపర్‌కు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ) చేసిన వారే అర్హులని తెలిపింది. అంతేకాకుండా…. పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. వచ్చే టెట్ నోటిఫికేషన్ కు ఈ నిర్ణయాలను వర్తింపజేయనున్నారు. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించి, డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టీజీటీ వారికి ఇంగ్లిష్ లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.