Hyderabad News: రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపులకు నేడే ఆఖరిరోజు. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించిన పోలీసుశాఖ…మళ్లీ పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. ద్విచక్రవాహనాలు(Bikes ), ఆటో(Auto)లకు 80శాతం, ఆర్టీసీ (RTC) బస్సులకు 90శాతం, ఇతర వాహనాలకు 60శాతం రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించుకోవచ్చు.
గతేడాది డిసెంబర్ 27నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు పోలీసుశాఖ అవకాశం కల్పించింది. తొలుత 15 రోజులు మాత్రమేనని తెలిపిన పోలీసుశాఖ( TS Police)…సాంకేతిక కారణాలతో పలుమార్లు సర్వర్ మొరాయించి ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెలాఖరి వరకు గడువు పొడిగించింది. దీంతో పెంచిన గడువు నేటితో ముగియనుండడంతో…ఇంకా చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారు ఎవరైనా సరే ఆన్‌లైన్ ద్వారా త్వరగా చెల్లించాలని పోలీసుశాఖ అలర్ట్ ఇచ్చింది.
మళ్లీ గడువు పెంచేది లేదు
పెండింగ్ చలాన్లు (Pending Traffic Challans) రాయితీతో చెల్లించేందుకు మళ్లీ గడువు పెంచేది లేదని పోలీసుశాఖ ఖరాఖండిగా తేల్చి చెప్పింది. మళ్లీ గడువు పెంచుతారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. రేపటి నుంచి పూర్తి మొత్తం వసూలు చేయనున్నట్లు కూడా హెచ్చరించింది. కాబట్టి పెండింగ్ చలాన్లు ఉన్న వారు డిస్కౌంట్ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అయితే భారీ రాయితీతో పెండింగ్ చలాన్లు కట్టించుకుంటున్నా….ఇంకా సగం మంది చలాన్ల సొమ్ముకట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. పెండిగ్ చలాన్ల ద్వారా పోలీసుశాఖకు భారీగానే ఆదాయం వచ్చినా…ఆశించిన మేర వసూలు కాలేదు. గతంలో దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలు కాగా….ఇప్పుడు అందులో సగం మేర మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.
చలానా వేసినా లెక్కచేయని వాహనదారులు
భారీ మొత్తంలో చలాన్లు విధించినా….వాహనదారులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. పదేపదే ట్రాఫింక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పెండింగ్ చలాన్లే దీనికి నిదర్శనం. ఇప్పటికీ మూడోవంతు బైక్ నడిపేవారు హెల్మెట్(HELMET) ధరించడం లేదు. పోలీసుల ముందే ట్రిఫుల్ రైడింగ్‌లతో చక్కర్లు కొడుతున్నారు. ఇక రాంగురూట్‌లో వచ్చేవారి సంగతి సరేసరి.ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీగా చలాన్లు విధించినా…పోలీసుశాఖ రాయితీ ఇస్తుందనే దీమాతో చాలామంది వాహనదారులు యథేచ్ఛగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.
కఠిన చర్యలేవీ..
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న వారిపై నామమాత్రపు కేసులు విధించి చేతులు దులుపుకుంటున్నారు. అలాగే పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసుశాఖ ప్రకటించినా….ఈ దిశగా పెద్దగా అడుగులు పడిన దాఖలాలు లేవు. కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, కొన్నిచోట్ల ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనూ వాహనదారుల్లో భయం లేకుండా పోయింది. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని పెంచకపోవడంతో పనిభారం పెరిగిపోయి….పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని చూడండి