ఈ మధ్య కాలంలో పలు సినిమాలు రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధించాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’, ‘జల్సా’, ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ లోనూ మంచి వసూళ్లతో సత్తా చాటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన మరో సినిమా మళ్ళీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అదే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’.
పవన్ కళ్యాణ్, తమన్నా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2012 అక్టోబర్ లో విడుదలైంది. ఆశించిన స్థాయి విజయం సాధించినప్పటికీ.. ఈ సినిమాని అభిమానించేవారు ఎందరో ఉన్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల సమయంలో తెలుగునాట రాజకీయ దుమారేమో రేపింది. అలాంటి సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్నారు. నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నట్టి కుమార్ తాజాగా ప్రకటించారు.
కాగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ బయోపిక్ గా వస్తున్న ‘యాత్ర-2’ అనే పొలిటికల్ మూవీ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఆ సినిమాకి ఒక్క రోజు ముందు పవన్ కళ్యాణ్ నటించిన పొలిటికల్ మూవీ రీ రిలీజ్ అవుతుండటం సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.