Patidar vs Sarfaraz takes centre stage at India nets: ఇంగ్లాండ్(England)తో రెండో టెస్ట్‌కు టీమిండియా(Team India) సిద్ధమవుతోంది. తొలి టెస్టులో అనూహ్య పరాజయం పాలై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ సేన… ఈ టెస్టులో గెలిచి మళ్లీ గాడిన పడాలని చూస్తోంది. రెండో టెస్టుకు కేఎల్ రాహుల్(KL Rahul), రవీంద్ర జడేజా(ravindra jadeja) దూరం కానుండటంతో.. సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది. రంజీల్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన సర్ఫరాజ్‌కు అవకాశం ఇస్తూ ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీసీసీఐ అతణ్ని కరుణించింది. రెండో టెస్ట్‌లో తుది జట్టులో చోటు దక్కితే రాణించి స్థానం పదిలం చేసుకోవాలని సర్ఫరాజ్ ఖాన్ పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు రజత్ పాటిదార్ కూడా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరిలో తుది జట్టులో ఎవరికి స్థానం దక్కనుందనే ప్రశ్నకు టీమిండియా బ్యాటింగ్ కోచ్ స్పందించాడు.
బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడంటే..?
వైజాగ్ టెస్టులో సర్ఫరాజ్(Sarfaraz)ను ఆడిస్తారా లేక రజత్ పటిదార్(Patidar)కు ఛాన్స్ ఇస్తారా అన్న ప్రశ్నకు భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించారు. సర్ఫరాజ్, రజత్ పటిదార్ ఇద్దరూ మంచి ఆటగాళ్లే అని… ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని అని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కొన్నాళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారని.. సర్ఫరాజ్, రజత్ పటిదార్‌లలో ఒకరినే ఎంపిక చేసుకోవాల్సివస్తే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని రాథోడ్ తెలిపాడు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ తుది జట్టుని ఖరారు చేస్తారని తెలిపాడు. ఫామ్‌లేక ఇబ్బందులు పడుతున్న శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌కు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మద్ధతుగా నిలిచాడు. రానున్న టెస్టులో వారు భారీ స్కోరు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
విశాఖ టెస్టుకు సర్వం సిద్ధం
విశాఖ వేదికగా ఫిబ్రవరి రెండో తేదీ నుంచి భారత్– ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏర్పాట్ల వివరాలను ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి మీడియాకు బుధవారం వెల్లడించారు. వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరో తేదీ వరకు రెండో టెస్టు జరగనుంది. తొలి టెస్టులో భారత జట్టు ఓటమిపాలు కావడంతో రెండో టెస్ట్ భారత జట్టుకు కీలకంగా మారింది. దీంతో ఈ టెస్టు చూసేందుకు వస్తున్న అభిమానుల సంఖ్య పెరుగుతుందని బిసిసిఐ అంచనా వేస్తోంది. అభిమానుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 15 వేలు, ఆఫ్‌లైన్‌లో 5 వేల వరకు టికెట్లు విక్రయించినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి వెల్లడించారు.
విద్యార్థులు, క్లబ్ క్రీడాకారులకు ఉచితం
రెండో టెస్టు మ్యాచ్ ను వీక్షించాలి అనుకునే విద్యార్థులు, క్లబ్ క్రీడాకారులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. రోజుకు రెండు వేల మంది చొప్పున 5 రోజులకు 10,000 మంది విద్యార్థులు మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేశారు. ఉచిత పాస్ కావాలి అనుకునే విద్యార్థులు యానిఫాం, ఐడీ కార్డులు తప్పనిసరిగా చూపించాల్సి వుంటుంది. విద్యార్థులను గేట్ నంబర్ 14 నుంచి ‘కె’ స్టాండ్‌లోకి అనుమతిస్తారు. విద్యార్థులతోపాటు టీచర్లు, ఇన్‌చార్జిలు వస్తే వారు తమ ఐడీ కార్డులను చూపిస్తే స్టేడియంలోకి అనుమతిస్తారు. అలాగే, రోజుకు 2,850 మంది చొప్పు క్రికెట్ క్లబ్ క్రీడాకారులకు 5 రోజులకు కలిపి 14,250 మందికి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.