స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి 68 ఏళ్ళ వయసులోనూ యంగ్ స్టార్స్ తో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో ఎంత కష్టపడ్డారో అగ్ర నటుడిగా ఎదిగిన తర్వాత కూడా అదే స్థాయిలో కష్టపడుతూ తనకి తానే సాటి అనిపించుకుంటున్నారు. అంతలా కష్టపడతారు కాబట్టే ఆయన అగ్ర స్థానాన నిలిచారు.
చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం చిరంజీవి ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు. పాత్రకి తగ్గట్టుగా తన శరీరాన్ని మలుచుకోవడం కోసం గ్రాఫిక్స్ ని నమ్ముకోకుండా.. కష్టాన్ని నమ్ముకున్నారు. ‘విశ్వంభర’ సినిమా కోసం మెగాస్టార్ చేస్తున్న వర్కౌట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకంటే సాధించడానికి ఏమీ లేదు అనే స్థాయికి చిరంజీవి ఎప్పుడో చేరుకున్నారు. కోట్ల మంది అభిమానుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న ఆయనను ఇటీవల పద్మ విభూషణ్ కూడా వరించింది. అయినప్పటికీ ఆయన నిత్య విద్యార్థిలా సినిమా కోసం కష్టపడుతూనే ఉన్నారు. 68 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలను తలదన్నేలా వర్కౌట్స్ చేస్తున్నారు. ఆయనను చూసి ఈ తరం హీరోలు ఎంతో నేర్చుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.