Ind Vs Eng Joe Root Eyes Historic Landmark In Vizag Test: విశాఖ(Visakha) వేదికగా ఇంగ్లాండ్-టీమిండియా (England-India) రెండో టెస్ట్ నేటి నుంచి జరగనుంది. తొలి టెస్టులో అనూహ్య పరాజయం పాలై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ సేన… ఈ టెస్టులో గెలిచి మళ్లీ గాడిన పడాలని చూస్తోంది. రెండో టెస్టుకు కేఎల్ రాహుల్(KL Rahul), రవీంద్ర జడేజా(ravindra jadeja) దూరం కానుండటంతో.. సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది. రంజీల్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన సర్ఫరాజ్‌కు అవకాశం ఇస్తూ ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీసీసీఐ అతణ్ని కరుణించింది. రెండో టెస్ట్‌లో తుది జట్టులో చోటు దక్కితే రాణించి స్థానం పదిలం చేసుకోవాలని సర్ఫరాజ్ ఖాన్ పట్టుదలతో ఉన్నాడు. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్ కూడా బజ్‌బాల్ ఆటతో ఈ టెస్ట్‌లోనూ గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ టెస్టులో బ్రిటీష్ జట్టు స్టార్ ఆటగాడు జో రూట్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
రూట్ సాధిస్తాడా..?
హైదరాబాద్(Hyderabad) వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) అరుదైన రికార్డును సృష్టించాడు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో విదేశీ బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ 2, 555 పరుగులు చేసి అగ్ర స్థానంలో ఉండగా… సరిగ్గా 2,555 పరుగులు చేసి జో రూట్ కూడా అదే స్థానంలో కొనసాగుతున్నాడు. రూట్ ఇంకొక్క పరుగు చేస్తే భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన విదేశీ క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. రూట్‌ను మరో రికార్డు కూడా ఊరిస్తోంది. రూట్ మరో 138 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 19 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన మొదటి ఇంగ్లాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్‌గా 14వ బ్యాటర్‌గా నిలనున్నాడు. రూట్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 339 మ్యాచులు ఆడాడు. 48.24 సగటుతో 66.41 స్ట్రైక్‌రేటుతో 18,862 పరుగులు చేశాడు. ఇందులో 46 శతకాతలు, 104 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సచిన్ తర్వాతే…
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 34,357 పరుగులతో సచిన్ ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, మహేలా జయవర్ధనే, జాక్వెస్ కలిస్, రాహుల్ ద్రవిడ్, బ్రియాన్ లారా, సనత్ జయసూర్య, చంద్రపాల్, ఇంజమామ్ ఉల్ హక్, ఏబీ డివిలియర్స్, క్రిస్‌గేల్ లు అంతర్జాతీయ క్రికెట్‌లో 19 వేలకు పైగా పరుగులు సాధించారు.
నేడే తొలి టెస్ట్
5 టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు నేటి నుంచి విశాఖపట్నం వేదికగా జరగనుంది. తొలిటెస్టులో ఓటమి చవిచూసిన టీమిండియా రెండో టెస్టులో ఎలాగైనా పుంజుకుని విజయాల బాటపట్టాలని కోరుకుంటోంది. గాయాల కారణంగా KL రాహుల్, రవీంద్ర జడేజా భారత జట్టుకు దూరమయ్యారు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది.