India vs England: వైజాగ్(Vizag) వేదికగా ఇంగ్లండ్(England)తో జరగుతున్న రెండో టెస్టుకు కేఎల్ రాహుల్(KL Rahul), రవీంద్ర జడేజా(ravindra jadeja) దూరమయ్యారు. వీరి స్థానంలో ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే ఇప్పటికే విరాట్ కోహ్లీ తదుపరి మ్యాచ్‌లు ఆడడంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ… స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడో టెస్ట్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఈ సిరీస్‌కు దూరమవుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది.
అనుమానమేనా….?
తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన రవీంద్ర జడేజా మూడో టెస్ట్‌కు కూడా దూరం కానున్నాడని తెలుస్తోంది. జడ్డూ గాయం చాలా తీవ్రమైందని, దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. జడ్డూ ఒకవేళ రాంచీలో జరిగే నాలుగో టెస్ట్ సమయానికి కోలుకుంటే అది అద్భుతమే అని తెలుస్తోంది.
విరాట్ వచ్చేస్తాడా..?
మూడో టెస్ట్(Third Test) నుంచి అందుబాటులో ఉంటాడనుకున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తుంది. విరాట్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాల చేత ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు ఇప్పటికే దూరమైన కోహ్లీ… తర్వాత జరుగబోయే మిగతా మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడన్న వార్తలు అభిమానులను ఆందోళన పరుస్తున్నాయి.
చివరి మూడు టెస్ట్‌లకు టీమిండియాను ప్రకటించాల్సి ఉన్నా విరాట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కోహ్లి తల్లి సరోజ్ కోహ్లి తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు, ఆమెను దగ్గరుండి చూసుకునేందుకే కోహ్లి మిగతా టెస్ట్‌లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ నిజంగానే కోహ్లి ఇంగ్లండ్‌తో తదుపరి సిరీస్‌కు దూరమైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగలినట్లే.
టాప్‌టెన్‌లో కోహ్లీ ఒక్కడే…
బ్యాటింగ్ విభాగం ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి విరాట్ కోహ్లీ( (Virat Kohli) ఒక్కడే టాప్-10లో( (Indian In Top 10 Batters) నిలిచాడు. కోహ్లీ ఒక స్థానం మెరుగై 767 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కివీస్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్.. నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. కేన్ మామ తర్వాత ఇంగ్లండ్‌కే చెందిన జో రూట్, ఆసీస్ వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌లు రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ డారెల్ మిచెల్ నాలుగో స్థానంలో ఉండగా పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరాడు. భారత్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసిన ఓలీపోప్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు.