దిశ, ఫీచర్స్ : ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 32 ఏండ్ల వయస్సులోనే ఆమె మరణానికి ప్రధాన కారణం సర్వైకల్ (గర్భాయ) క్యాన్సర్. దీంతో ప్రస్తుతం ఈ క్యాన్సర్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఒక నివేదిక ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా 6,04,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. దాదాపు 3,42,000 మంది ఈ వ్యాధితో మరణించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం మహిళల్లో గర్భాశయ ముఖద్వారం లేదా యోని నుంచి గర్భాశయంలోకి ప్రవేశించే అసాధారణ కణాల పెరుగుదల వల్ల సర్వైకల్ క్యాన్సర్ సంభవిస్తుంది. నిజానికి ఈ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. ప్రాథమిక దశలోనే గుర్తించకపోతే ప్రాణహాని ఉంటుంది. అందుకే లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.
మొదటి దశలో గుర్తించలేమా?
సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు గుర్తించడం కష్టం. ఎందుకంటే ఆ సమయంలో లక్షణాలు బయటకు కనిపించవు. అలా కనిపించడానికి చాలా కాలం పడుతుంది. అయితే కొన్ని ప్రాథమి లక్షణాలను బట్టి గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని అంచనా వేయవచ్చని, గుర్తించాక డాక్టర్లను సంప్రదించిన నిర్ధారణ చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.
లక్షణాలు
సర్వైకల్ క్యాన్సర్ డెవలప్ అవుతున్నప్పుడు మహిళల్లో శృంగార సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు విపరీతమైన నొప్పి, స్త్రీ జననాంగాల నుంచి దుర్వాసన, సెక్స్ తర్వాత మహిళ జననేంద్రియాల్లో రక్తస్రావం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, విపరీతమైన అలసట, వెయిట్ తగ్గడం, ఆకలి మందగించడం వంటివి సంభవించవచ్చు. అలాగే స్టమక్ పెయిన్, యూరిన్ వెళ్లిన సమయంలో మంట వంటివి గర్భాశయ క్యాన్సర్ వచ్చేందుకు దారితీసే లక్షణాలుగా పేర్కొనవచ్చు. ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే క్యాన్సర్‌కు ఫస్ట్ స్టేజ్ స్టార్టయిందో లేదో అని వైద్య నిపుణులను సంప్రదించి నిర్ధారించుకోవడం మంచిది.
ఏ టెస్టులు చేయించుకోవాలి?
గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV). ఇది శరీరంలోకి ప్రవేశించాక పలు ప్రాథమిక లక్షణాలు కనిపిస్తుంటాయి. దీనివల్ల తీవ్రమైన జ్వరం కూడా వస్తూ ఉంటుంది. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే స్త్రీలు తమ జీవితాన్ని కాపాడుకోవచ్చు. తగిన కేర్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. ముఖ్యంగా మాలిక్యులర్ టెస్టులు, పాప్ స్మియర్ టెస్టులు వంటివి చేయించుకోవడం ద్వారా ముందుగానే గుర్తించి జాగ్రత్త పడవచ్చు.
నిర్ధారణ అయితే గనుక..
గర్భాశయ క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉన్నట్లు నిర్ధారణ అయితే గనుక భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రైమరీ స్టేజ్‌లో శస్త్రచికిత్సల ద్వారా, రేడియేషన్ థెరపీ ద్వారా ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు. కాకపోతే వ్యాధి ముదిరాక మాత్రమే తగ్గడం కష్టం. ఈ దశలోనే ప్రాణహాని సంభవించే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్‌కు కారణం అయ్యే హెచ్‌పీవీ వైరస్ సోకకుండా ముందస్తుగా వేసే వ్యాక్సినేషన్ కూడా అందుబాటులో ఉంది. 9 నుంచి 26 ఏండ్ల మధ్య వయస్సుగలవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడంవల్ల గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చు.