India vs England 2nd Test At Vizag: అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్(Shoaib Bashir) బోణీ అదిరింది. విశాఖ టెస్టులో అరంగేట్రం చేసిన ఈ స్పిన్నర్ తొలి వికెట్ సాధించాడు. అది కూడా డేంజరస్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఔట్ చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. బషీర్ వేసిన నాలుగో ఓవర్లో హిట్‌మ్యాన్ ఓలీ పోప్ చేతికి చిక్కాడు. తొలి మ్యాచ్‌లోనే హిట్‌మ్యాన్ వికెట్ లభించడంతో బషీర్ ఎగిరి గంతేశాడు. రోహిత్ అవుట్‌తో భారత్ 40 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన బషీర్ వీసా ఆలస్యం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అనంతరం బీసీసీఐ చొరవతో భారత హై కమిషన్ బషీర్‌కు వీసా మంజూరు చేసింది.
మ్యాచ్ సాగిందిలా…
టస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 40 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. డెబ్యూ క్యాప్ అందుకున్న స్పిన్నర్ బషీర్ నాలుగో ఓవర్లోనే విధ్వంసకర ఆటగాడు రోహిత్ శర్మను ఔట్ చేసి ఇంగ్లండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. 14 పరుగులకే రోహిత్ అవుటయ్యాడు. గిల్(34), యశస్వీ ధాటిగా ఆడి రెండో వికెట్‌కు 49 రన్స్ జోడించారు. అండర్సన్ సూపర్ డెలివరీతో 89 పరుగుల వద్ద గిల్‌ను బోల్తా కొట్టించాడు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. అద్భుతమైన ఆట తీరుతో దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో సెంచరీతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 149 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్… సొంతగడ్డపై తొలి శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 22 ఏళ్ల లెయశస్వి జైస్వాల్ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. 23 ఏళ్ల వయసు కంటే ముందే విదేశీ, స్వదేశీ గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. యశస్వి కంటే ముందు రవిశాస్త్రి, సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లి ఈ ఘనత సాధించారు. యశస్వితో సహా వీళ్లంతా రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకే ఆడటం విశేషం. గమనార్హం. ప్రస్తుతం టీమిండియా 80 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా నడుస్తోంది. 230 బంతుల్లో 159 పరుగులతో జైస్వాల్ ఆడుతున్నాడు.
అనుమానమేనా….?
తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన రవీంద్ర జడేజా మూడో టెస్ట్‌కు కూడా దూరం కానున్నాడని తెలుస్తోంది. జడ్డూ గాయం చాలా తీవ్రమైందని, దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. జడ్డూ ఒకవేళ రాంచీలో జరిగే నాలుగో టెస్ట్ సమయానికి కోలుకుంటే అది అద్భుతమే అని తెలుస్తోంది.
విరాట్ వచ్చేస్తాడా..?
మూడో టెస్ట్(Third Test) నుంచి అందుబాటులో ఉంటాడనుకున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తుంది. విరాట్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాల చేత ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు ఇప్పటికే దూరమైన కోహ్లీ… తర్వాత జరుగబోయే మిగతా మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడన్న వార్తలు అభిమానులను ఆందోళన పరుస్తున్నాయి.