Telangana Politics : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఓటమి పాలయిన భారత రాష్ట్ర సమితి ( Brs)పార్టీకి భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ (Station Ghanpur) మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య (Tadikonda Rajaiah)…బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను మాజీ మంత్రి కడియం శ్రీహరికి కేటాయించడంతో…లోలోపల రగిలిపోతున్నారు రాజయ్య. ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి విజయం సాధించారు. రాజయ్యకు రైతుబంధు ఛైర్మన్ పదవి ఇచ్చింది బీఆర్ఎస్.
అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం
తాడికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 10వ తేదీన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు పూర్తయినట్లు సమాచారం. ఒకటి రెండ్రోజుల్లో ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాడికొండ రాజయ్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ పై ఇప్పటికే కాంగ్రెస్ నుంచి హామీ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. స్టేషన్ ఘన్ పూర్ సెగ్మెంట్ లో దాదాపు 85 వేల ఎస్సీ ఓట్లు ఉన్నాయి. అందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే 70 వేలకుపైగా ఉన్నాయి. అవన్నీ గంపగుత్తగా తనకేపడుతాయనే భరోసాతో ఉన్నారు రాజయ్య. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి బలమైన భరోసా కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.
ఘన్ పూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం
2009లో ఘన్ పూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి…తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 ఉప ఎన్నికలతో పాటు 2014,2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు పోటీ చేస్తే…నాలుగుసార్లు రాజయ్యే విజయం సాధించారు. ఒక్క ఎన్నికల్లో ఓటమి అన్నది ఎరగలేదు తాడికొండ రాజయ్య.
ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ
పలువురు బీఆర్ఎస్ నేతలు…కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలతో పాటు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన సభ్యులు సైతం హస్తం పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు… సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే కలిశారు. వీరంతా తమ నియోజకవర్గాల్లో సమస్యలను, పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికే కలిశామని చెబుతున్నా….సీఎంను కలవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆ తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యల గురించే అని చెబుతున్నా…బీఆర్ఎస్ ను వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు 39 ముక్కలవుతారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…కొన్ని రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు…ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన తాడికొండ రాజయ్య…ఈ నెల 10వ తేదీ హస్తం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ లేదంటే రేపు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఛాన్స్ ఉంది.
మరిన్ని చూడండి