The Assembly battle in Telugu States: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి రాజకీయాలు మరో రూపును సంతరించుకోనున్నాయి. ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ఏపీలో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశం జరగనుంది. కాగా, ఏపీ పదిహేనవ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు. ఇక, తెలంగాణలో ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు బహిరంగ వేదికలపై.. విమర్శలు గుప్పించుకున్న ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు.. అసెంబ్లీల వేదికగా తమ వాణి వినిపించనున్నాయి. తెలంగాణలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ సభా వేదికగా.. తమ తమ వ్యూహాలను రక్తికట్టించనున్నాయని తెలుస్తోంది.
ఏపీ విషయం..
ఏపీలో కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో ప్రధాన ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. సభలు, సమావేశాలు.. ఎటు చూసినా.. హాట్ పాలిటిక్సే(Hot Politics) కళ్లకు కడుతున్నాయి. అధికార పక్షం వైసీపీ `సిద్ధం` (Sidhdham) సభలతో వేడి పుట్టి స్తే.. ప్రతిపక్షం టీపీపీ `రా.. కదలిరా!`(Raa kadaliraa) అంటూ.. మరింత సెగ పుట్టిస్తోంది. ఇంకోవైపు.. జనసేన వారాహి యాత్ర కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. మరోవైపు, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా సోమవారం నుంచి రాష్ట్రంలో యాత్రలకు రెడీ అవుతున్నారు.ఇలా.. రాష్ట్రంలో రాజకీయ వేడి.. హాట్ హాట్‌గా కొనసాగుతోంది.
ఈ క్రమంలో మరో పొలిటికల్ సెగ సోమవారం నుంచి ఏపీలో మరింత రగులుకోనుంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నా యి. ఎన్నికలకు ముందు.. వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఆఖరి బడ్జెట్ ఇదే. పైగా అసెంబ్లీ ఆఖరి సమావేశాలు కూడా ఇవే కావడం గమనార్హం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఇదిలావుంటే.. ఈ సమావేశాలను ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా ముగించాలని అధికారపక్షం ప్రయత్నిస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం.. కనీసం 10 రోజులు అయినా.. సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది.
ఇక, సమావేశాల్లో కేవలం బడ్జెటపైనే చర్చ కాకుండా.. తమకు ప్రత్యేక అంశాలు ఉన్నాయని టీడీపీ ఇప్పటికే చెబుతోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, పోలవరం, దాడులు, పోలీసుల కేసులు ఇలా .. అనేక అంశాలను టీడీపీ ప్రస్తావిస్తోంది. మరోవైపు.. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి.. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారి విషయంలో మౌనంగా ఉండడాన్ని కూడా సభలో లేవనెత్తనున్నారు. మొత్తంగా టీడీపీ చాలా వ్యూహాత్మకంగా అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంది. అయితే.. పరిస్థితి ఎలా ఉన్నా.. తట్టుకుని ముందుకు సాగాలని.. వైసీపీ కూడా రెడీ అయింది. దీంతో అసెంబ్లీ వేదికగా.. మాటల తూటాలు, సవాళ్లు మరింత పెరగనున్నాయి. పైగా ఎన్నికలకు ముందు కావడంతో ఈ వేడి మరింత రాజుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ పరిస్థితి ఇదీ..
తెలంగాణలో ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్యారెంటీల అమలు, కృష్ణా ప్రాజెక్టుల విషయంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఈ సమావేశాలు వాడీ వేడీగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy).. తన లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పడం గమనార్హం. పైగా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేవారు ఎవరని ఆయన గద్దించారు. ఈ పరిణామాలు.. సభలో చర్చకు రావడం ఖాయం. ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కూడా.. ఈ రెండు మాసాల కాలంలోని కాంగ్రెస్ పాలనా లోపాలను.. సంక్షేమ పథకాలను ప్రస్తావించి.. హడావుడి చేసి, పార్లమెంటు ఎన్నికల్లో తమ హవా తగ్గకుండా చూసుకునే ఎత్తుగడలు సిద్ధం చేసింది. కృష్ణాజలాలు, కేంద్ర సాయం వంటివి బీఆర్ ఎస్ ప్రస్తావించే ఛాన్స్ ఉంది.
మరిన్ని చూడండి