18 సంవత్సరాల క్రితం 2006లో మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘స్టాలిన్’. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. వాస్తవానికి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’లో త్రిష హీరోయిన్‌గా నటించాల్సింది. కానీ, క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తాజాగా చిరంజీవి, త్రిష కలిసి ‘విశ్వంభర’ చిత్రంలో నటించబోతున్నారు. గత కొంతకాలంగా ‘విశ్వంభర’లో త్రిష హీరోయిన్‌గా నటించనుందని రూమర్లు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమేనని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ సినిమా సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష. ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారు చిరంజీవి. చిత్ర యూనిట్ త్రిషకు ఘనస్వాగతం పలికింది. ‘వెల్‌కమ్ జార్జియస్..’ అంటూ త్రిషను స్వాగతించారు చిరంజీవి. ‘మళ్లీ 18 ఏళ్ల తరువాత ఇలా మెగాస్టార్‌తో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది.. ఎంతో గొప్పగా స్వాగతించారు చిరు సర్’ అని త్రిష ట్వీట్ చేసింది.
ఆచార్య సినిమాలో త్రిష నటించకపోవడానికి కారణం తనకి వేరే సినిమా రావడం వల్ల వెళ్లిపోయిందని వేదికపైనే చిరంజీవి వెల్లడిరచారు. అయితే త్రిష మాత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పింది. దీంతో వీరిద్దరూ కలిసి మళ్ళీ నటించే అవకాశం లేదని అంతా అనుకున్నారు. ఇటీవల నటుడు మన్సూర్ అలీఖాన్ విషయంలో త్రిషకు తన పూర్తి మద్దతు తెలిపారు చిరంజీవి. ఆమెను సపోర్ట్ చేయడంతో ‘విశ్వంభర’ చిత్రంలో త్రిష నటిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడదే నిజమని తేలిపోయింది.