హైదరాబాద్: వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలు వదిలి ఏపీలో ఎంట్రీ ఇచ్చాక అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ షర్మిల పొలిటికల్ కామెంట్లు మొదలుపెట్టాక, వైఎస్సార్ సీపీ నుంచి ఆమెకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. షర్మిలను చూస్తే జాలేస్తోందని కొందరు అంటే, జగన్ పై విమర్శలు చేసే స్థాయి షర్మిలది కాదని వైసీపీ నేతలు, ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. అయితే షర్మిలపై వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవం అని, కొందరు అసత్య ప్రచారాలు, బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని వైస్సార్ టీపీ నేత పిట్ట రాంరెడ్డి అన్నారు. ఇటువంటి ఘటనలు సమాజానికి సిగ్గు చేటు అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర
పిట్ట రాంరెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే YSRTP పార్టీని పెట్టి సుదీర్ఘ పాదయాత్ర చెసిన నేత షర్మిల. అందుకే ప్రభుత్వం వ్యతిరేక ఓట్ చీలకుండా పోటీ నుంచి తొలగి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. కేసీఆర్‌ను గద్దె దింపడానికి షర్మిల చేసిన కృషిని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తూ ఏపీలో పార్టీని అధికారంలోకి తేవాల్సిన గౌరవం ఇచ్చారు. ఏపీసీసీ బాధ్యతలు స్వీకరించిన తరువాత షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. షర్మిల ముక్కు సూటి మనిషి. డేర్ అండ్ డైనమిక్ లీడర్. ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి రావడానికి షర్మిల కీలక పాత్ర పోషించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫలాలపై షర్మిల ప్రశ్నిస్తే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఏపీలోని కొందరు విలువలు లేని నాయకులు షర్మిలపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణలో చేసినట్లే ఏపీలోనూ ఆమె పోరాటం కొనసాగుతోంది. షర్మిల సొంత కష్టంతో రాజకీయంగా ఎదుగుతున్నారు. ఆమె నిజాయితీ ఉన్న నాయకురాలు. కుటుంబంలో ఉన్న సమస్యలను తనలో తాను దిగమింగుకొని రాజకీయం చేస్తున్నారు. కానీ షర్మిల ఎక్కడా నోరు జారడం లేదు. కానీ షర్మిల రాకతో ఏపీ ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఆమెపై రాజకీయంగా మాట్లాడండి, కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే సూర్యుడు పైన ఉమ్మేస్తే మన మీదే పడుతుంది అని గుర్తుంచుకోవాలి. షర్మిలపై YSRCP నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే బాగోదు అంటూ హెచ్చరిక జారీ చేస్తున్నాం. జగన్ కు మా వినతి… వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చెల్లి షర్మిల ఎంత కష్టపడ్డాదో ఆయనకు తెలుసు. కానీ ఆమెపై వస్తున్న ఆరోపణలు, అసత్య ప్రచారాలపై ఒక అన్నగా జగన్ ఖండిచాలని ఆశిస్తున్నామని’ పిట్ట రాంరెడ్డి పేర్కొన్నారు.
షర్మిల ఎవరినీ మోసం చేయలేదు..
తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దింపి కాంగ్రెస్ లో అధికారంలోకి తెచ్చాక, అధిష్టానం ఇచ్చిన బాధ్యతలతో ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని పిట్ట రాంరెడ్డి తెలిపారు. అయితే తెలంగాణలో ఉన్న YSRTP నాయకులను, కార్యకర్తలను షర్మిల మోసం చేయలేదు అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో YSRTP నాయకులకు మంచి స్థానం ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారని తెలిపారు. కానీ పార్టీ వీడి, వెళ్లిన వారికి ఇప్పటికీ షర్మిల అంటే వెన్నులో వణుకు పుడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని చూడండి