Balka Suman Comments on Revanth Reddy: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పు చూపిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగి ఆందోళనలు చేపట్టాయి. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్ దిష్ఠి బొమ్మలను దహనం చేసి బాల్క సుమన్ ను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై మంచిర్యాల కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన, విద్యార్ధి సంఘాల శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాల్క సుమన్ తీరుపై ఆగ్రహం వెలిబుచ్చారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు బాల్క సుమన్ దిష్టిబొమ్మను ఊరేగించారు.
బాల్క సుమన్ దిష్ఠిబొమ్మలు దహనం
బాల్క సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బాల్క సుమన్ దిష్ఠిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ.. బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. ప్రజా పాలనను చూసి ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఇతర జిల్లాలకు చెందిన సుమన్ ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించడానికి కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ మెప్పుకోసం కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. సుమన్ అహంకారం చెన్నూర్ లో ఆయన ఓటమికి కారణమైందని గ్రహించుకుని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. పోలీసులు సుమన్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బాల్క సుమన్ ను చెప్పులతో కొట్టండి: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. నీకు తగిన శాస్తి చేసే రోజులు దగ్గర పడ్డాయి అంటూ ఆగ్రహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు బాల్క సుమన్ ఎక్కడ కనిపించినా అతణ్ని చెప్పులతో కొట్టాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనను కొనసాగిస్తున్నారని ప్రజలకు దగ్గరగా ఉంటూ ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చేతగాని చేష్టలు చేస్తే ప్రజలెవరు నమ్మరని, ప్రజలు స్వేచ్ఛాయుత పాలనను కోరుతూ నేడు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని హెచ్చరించారు. బాల్క సుమన్ ఇకనైనా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకుంటే ప్రజలు కాంగ్రెస్ కార్యర్తలు చెప్పులతో కొట్టడం ఖాయమని అన్నారు.
చెన్నూర్ లో చెదరగొట్టిన పోలీసులు
చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంగళవారం చెన్నూరు పట్టణంలో కాసేపు ఉద్రిక్తత కొనసాగింది. టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బాల్క సుమన్ కు అండగా నిలుస్తూ ఈ ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్ ను మాటలు అంటూ ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు.
మరిన్ని చూడండి