Telangana Irrigation Department: తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖలో ప్రస్తుతం ఇంజినీర్ ఇన్ ఛీప్ (ఈఎన్సీ)గా ఉన్న మురళీధర్ రావును తప్పుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అలాగే రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జి వెంకటేశ్వరరావును కూడా మంత్రి తొలగించారు.
మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టును ఆధారం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల ఇంజినీర్లపై ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా.. ఈఎన్సీ మురళీధర్‌రావును తప్పుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశించారు. ఈ క్రమంలోనే మరింత మంది నీటిపారుదల శాఖలోని ఇంజినీర్లపైన కూడా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
ఇటీవల నీటిపారుదల శాఖ ముఖ్య ఇంజినీర్ మురళీధర్ 2013లోనే రిటైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి మురళీధర్ నే కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించింది. దాదాపు 11 ఏళ్ల నుంచి ఆయనే ఈఎన్సీగా ఉంటున్నారు. మురళీధర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టులకు పని చేశారు.
అయితే, మురళీధర్‌ను పదవి నుంచి తొలగించి విచారణ చేస్తే నీటిపారుదల ప్రాజెక్టుల్లోని అక్రమాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. ముఖ్య ఇంజినీర్లను పదవి నుంచి తొలగించాలని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీ అధికారులు డిమాండ్లు చేశారు.
మరిన్ని చూడండి