అమిత్ షాతో భేటీ పూర్తైన తర్వాత ఇరు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. టిడిపి అధినేత చంద్రబాబు తో చర్చల పై పెదవి విప్పని బిజేపి వర్గాలు. చర్చల గురించి అధికారికంగా ఏలాంటి ప్రకటనలు, సమాచారం ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ నుంచి వచ్చే అవకాశం లేదని బిజేపి వర్గాలు స్పష్టం చేశాయి. చర్చలపై మాట్లాడేందుకు బిజేపి నాయకులు ఏమాత్రం ఇష్టపడలేదు. చర్చలు ముగిసిన తర్వాత అమిత్ షా నివాసం నుంచి రామ్మోహన్ నాయుడు నివాసానికి చంద్రబాబు వెళ్లారు. రాత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలోనే బస చేశారు. చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు టీడీపీ వర్గాలు సంకేతాలను ఇచ్చాయి. ఇరు పార్టీల ప్రయోజనాల రీత్యా కలిసి పని చేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. సుమారు గంటపాటు జరిగిన చర్చల్లో ఏపీలో ఇరుపార్టీలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది . దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమిని తిరిగి బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది.