ఏపీలో బీజేపీ సపోర్ట్ ఎవరికి?
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో ఏమాత్రం పట్టులేని.. ఒంటరిగా పోటీ చేస్తే కనీసం కాంగ్రెస్ పార్టీ మాత్రంగా కూడా ఓట్లు సాధించలేదని సర్వేలు చెబుతున్న పార్టీ.. ప్రధాన పార్టీలను శాసిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ బీజేపీ ప్రాపకం కోసం అల్లాడుతున్నాయి. ఏపీలో ఏమాత్రం బలపడలేకపోయిన బీజేపీ.. ఇప్పుడు మాత్రం ఇతర పార్టీల బలహీనతలను క్యాష్ చేసుకుంటోంది. అసలు ఏమాత్రం పట్టులేని పార్టీ.. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను వణికిస్తోందంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఎలాగైనా అధికారం చేజారి పోనివ్వకూడదని ఒక పార్టీ.. పోయిన అధికారాన్ని ఈసారైనా దక్కించుకోవాలని మరో పార్టీ బీజేపీకి బీభత్సమైన హైప్ ఇస్తున్నాయి.
బీజేపీని ఎంటర్‌టైన్ చేస్తున్న పార్టీలు..
ఈ క్రమంలోనే బీజేపీని చెంతన చేర్చుకోవాలని టీడీపీ – జనసేన కూటమితో పాటు, వైసీపీ కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. బీజేపీ మాత్రం మూడు ముక్కలాట ఆడుతోంది. ఉదయం ఒకరితో.. మధ్యాహ్నం ఒకరితో.. రాత్రికి మరొకరితో మంతనాలు సాగిస్తోంది. అందరినీ ఆశల పల్లకిలో ఊయలలూగిస్తోంది. ఎవరి స్వార్థం కోసం వారు బీజేపీని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అందుకే ఏమాత్రం పట్టులేని.. ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కించుకోలేని బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తోంది. వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకట్ట వేయాలంటే టీడీపీకి బీజేపీ సపోర్ట్ కావాల్సిందే. ఇక వైసీపీకి విజయం సాధించాలంటే అధికార యంత్రాంగాన్ని తప్పకుండా వాడుకోవాల్సిందే. మరి ఇక్కడ ప్రజల పాత్రేంటి? కేవలం ప్రేక్షకులేనా?
బీజేపీ గ్రిప్‌లో ప్రధాన పార్టీలు..
ఒకరేమో నేను అభిమన్యున్ని కాదు.. అర్జనున్ని అంటారు. తనకు ప్రజలే శ్రీకృష్ణుడు అంటారు. మరి అర్జనుడు శ్రీకృష్ణుడి సాయం కోరాలి కానీ మరొకరి సాయం కోరి వారిని ఎంటర్‌టైన్ చేయడమేంటి? ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీజేపీ ఆశీస్సులు తప్పనిసరి అన్నట్టుగా పరిస్థితులను ఆ పార్టీ మార్చేసింది. ఏపీలో జనాలను బీజేపీ గెలుచుకోలేకపోయినా కూడా ప్రధాన పార్టీలను మాత్రం గ్రిప్‌లో పెట్టుకుంటోంది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో మాత్రం అధికార, విపక్షాలు రెండూ కూడా బీజేపీకి వత్తాసు పలుకుతున్నాయి. బీజేపీని ఎదిరించేంత సాహసం ఈ రెండు పార్టీలకూ లేకుండా పోయింది.
ఇక బీజేపీ ఇలాంటి రాజకీయ చదరంగాలు ఆడి ఏపీలో మరింత బలహీనమవడం ఖాయం.