ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ(Siva Balakrishna) అరెస్ట్ తో రెవెన్యూ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పెద్దచేప వలకు చిక్కడంతో చిన్న చేపలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. తమ పేర్లు ఎక్కడ భయటకు వస్తాయేమోనని భయపడి చస్తున్నారు. కొన్ని రోజులు హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయంలో లంచం పేరు చేబితే అధికారులు ఉలిక్కిపడుతున్నారు. ఏమైనా పనులు ఉంటే ఈ వ్యవహారం మొత్తం సద్దుమణిగిన తర్వాత చూద్దామంటూ దాటేవేస్తున్నారు
ఏసీబీ దాడులతో అలజడి
హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయంలో ఏ పని జరిగినా…ఏ ఫైల్ ముందుకు కదలాలన్నా చేయి తడపాల్సిందే. ఈ విషయం ఆ కార్యాలయానికి ఒక్కసారైనా వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఇక్కడ సమాన పనికి సమాన వేతనం ఇస్తారో లేదో తెలియదు కానీ…అవినీతి సొమ్ములో మాత్రం వాటాల పంపకం సమానంగా ఉంటుంది. ఫ్యూన్ దగ్గర నుంచి…డైరెక్టర్ వరకు ఎవరికి చెల్లించాల్సింది వారికి ముట్టజెప్పాల్సిందే. లేకపోతే నీ ఫైల్ అక్కడే ఆగిపోతుంది. ఏసీబీ(ACB) అధికారుల గాలానికి ఏకంగా హెచ్ఎండీఏ డైరెక్టర్ శివబాలకృష్ణ(Siva Balakrishna) దొరకడంతో….దిగువస్థాయి సిబ్బంది గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయంలో ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే డైరెక్టర్ ఒక్కరే సంతకం పెడితే సరిపోదు. ఖచ్చితంగా దిగువస్థాయి సిబ్బంది పాత్ర ఉండాల్సిందే. అధికారిక లెక్కల ప్రకారమే శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల విలువ రూ.250 కోట్లు దాటిపోవడంతో….ఇప్పుడు దిగువస్థాయి సిబ్బంది పాత్రపైనా ఏసీబీ(ACB) అధికారులు దృష్టి సారించారు. కార్యాలయంలో ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారు, బినామీలు దాడుల భయంతో దినదిన గండంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏసీబీ(ACB) అధికారుల నుంచి పిలుపు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తమ పై అధికారులు ఆదేశాలు పాటించినందుకు అవినీతి మరకలు తమకు ఎక్కడ అంటుకుంటాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏసీబీ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని భయంగా గడుపుతున్నారు.
హెచ్ఎండీఏ కార్యాలయంలో సోదాలు
శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ(ACB) అధికారులు…ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అమీర్ పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ లోఉన్న హెచ్ఎండీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కీలకమైన పత్రాలు జిరాక్స్ తీసుకోవడంతో పాటు కొన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకున్నారు.అన్ని దస్త్రాల పరిశీలన అనంతరం….హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగంలో ఆయన సూచనల మేరకు పలువురు ఉద్యోగులు పనిచేసినట్లు గుర్తించార. ఇప్పటి వరకు భారీ బహుళ అంతస్తుల భవనాల అనుమతులు, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్‌లకు ఇచ్చిన అనుమతుల పత్రాలను పరిశీలించిన అధికారులు….భారీగా అవకతవకలకు పాల్పడినా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు. అలాంటి ఫైళ్ల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో ప్లానింగ్ ఆఫీసర్‌తో పాటు ఏపీవోలు(APO), జేపీవో(JPO)లు తనిఖీ చేసి నివేదికను రూపొందించాల్సి ఉన్నా, డైరెక్టర్‌గా ఉన్న బాలకృష్ణ చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ(HMDA) డైరెక్టర్ కింద పనిచేసిన కొందరు అధికారులను కూడా ఏసీబీ(ACB) అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. శివ బాలకృష్ణ విచారణ పూర్తయే వరకు హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులు కంటి మీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
మరిన్ని చూడండి