Innovative Governance: ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిపై పోటీచేసి దేశం మొత్తం తనవలైపు తిప్పుకునేలా చేసిన తెలంగాణలోని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(Katipally Venkata Ramana Reddy) ప్రజలకు సేవలు అందించడంలోనూ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఒకే ఒక్కడు సినిమాలో సీఎం అర్జున్ ఏర్పాటు చేసిన తరహాలో నియోజకవర్గ వ్యాప్తంగా ఫిర్యాదుల పెట్టే(Complaint Box)లు పెట్టిస్తున్నారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను చిట్టీపై రాసి ఆ పెట్టెలే వేస్తే నేరుగా తానే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఫిర్యాదుల పెట్టెను స్వయంగా ఆయనే ఆరంభించారు.
ఫిర్యాదుల పెట్టె
శంకర్(Sankar) దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్(Arjun) నటించిన ఒకేఒక్కడు చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రంలో ఒకరోజు ముఖ్యమంత్రి(CM)గా పనిచేసిన అర్జున్ వినూత్న పాలనతో ప్రజల మనసు గెలుచుకుంటాడు. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు అధికారులు, పాలకుల వద్దకు వచ్చేందుకు బయపడుతున్నారని గ్రహించిన సీఎం వీధివీధిన ఫిర్యాదుల పెట్టె పెట్టిస్తాడు. ఏరోజు అయితే ఆ ఫిర్యాదుల పెట్టె ఖాళీగా దర్శనమిస్తుందో అప్పుడే తాను మంచి పాలన అందించినట్లు ప్రజలకు చెబుతాడు. మొదట్లో పెద్దఎత్తున ఫిర్యాదులు రాగా వాటిని సీఎం పరిష్కరించగా…. సినిమా ఎండింగ్‌కు వచ్చేసరికి ఆ ఫిర్యాదుల పెట్టె ఖాళీగా కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి పథకానికే శ్రీకారం చుట్టాడు కామారెడ్డి(Kamareddy) ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(Venkata Ramana Reddy ). ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయించారు.కామారెడ్డిలో ఫిర్యాదు బాక్స్ ను ఆయన ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ఫిర్యాదులను పరిశీలించి తానే స్వయంగా వచ్చి పరిష్కరిస్తానన్నారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు బాక్స్‌ల ద్వారా తనకు తెలియజేయాలని సూచించారు.
ఆదర్శ పాలన
నీతులు చెప్పడం సులభమే పాటించడం కష్టమంటారు.ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టినా..తమకు లాభం రాకపోయినా పర్వాలేదు గానీ నష్టం రాకుండా చూసుకుంటారు పాలకులు. ఇరుకుగా ఉన్న రోడ్డు విస్తరణ కోసం తన ఇంటిలో కొంత భాగాన్ని ముందుగా ఆయనే స్వయంగా కూల్చివేసి ఆదర్శంగా నిలిచారు. వెయ్యి గజాలకు పైగా ఉన్న స్థలాన్ని ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. దీని విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఈ రోడ్డు విస్తరణ అత్యంత అవసరమని గుర్తించిన ఎమ్మెల్యే…విస్తరణ పనులు ముందుగా తన ఇంటి నుంచే ప్రారంభించారు. రోడ్డు విస్తరణ పనులు ఇంకా చేపట్టనప్పటికీ…భవిష్యత్ లోనూ ఎవరూ వేలెత్తి చూపకుండా ఆయనే ముందడుగు వేశారు. మిగిలిన వారు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.
రికార్డు గెలుపు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమాహేమీలను ఢీకొట్టి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) స్వయంగా కామారెడ్డిలో పోటీ చేయగా… ఆయనపై పోటీకి సై అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సైతం కాలుదువ్వారు. వీరిరువురి మధ్య వెంకటరమణారెడ్డి నిలుస్తాడా అన్న అనుమానాలు రేకెత్తాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అటు కేసీఆర్ ను, రేవంత్ రెడ్డిని వెనక్కి నెట్టి జయకేతనం ఎగురవేశారు. హేమాహేమీలు రంగంలోకి దిగినా…వందలకోట్లు డబ్బులు కురిపించినా…ఆయన గెలుపును ఆపలేకపోయారు. దీనికి కారణం ఆయన ప్రజలతో మమేకమ్యే తీరే…స్థానికంగా అందుబాటులో ఉంటాడని…ఎప్పుడు ఏ పనికి పిలిచినా వస్తాడని నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు పేరు ఉంది.చెప్పాడంటే చేస్తాడని ప్రతీతి. అందుకే కేసీఆర్, రేవంత్ రెడ్డిని కాదనుకుని మరీ వెంకటరమణారెడ్డికి జనం పట్టం కట్టారు. అది నిలబెట్టుకునేందుకే ఆయన పాలనలో వినూత్న ఒరవడి సృష్టిస్తున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందని భావించి ముందుగానే ఇంటిని కూల్చివేసినా… ఇప్పుడు ఫిర్యాదుల పెట్టే పెట్టించినా అది ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలన్న సత్సంకల్పమే.
మరిన్ని చూడండి