ఇండస్ట్రీలో కాంబినేషన్ అనేది ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అన్ని కాంబినేషన్లూ విజయాన్ని అందుకోలేవు. కొన్ని కాంబినేషన్లు ట్రెండ్‌ని క్రియేట్ చేస్తాయి, కొన్ని కాంబినేషన్లు చరిత్ర సృష్టిస్తాయి, కొన్ని డిజాస్టర్స్‌ని అందిస్తాయి. ప్రస్తుతం ఓ కొత్త కాంబినేషన్ గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అదే.. విఐ ఆనంద్, అల్లు అర్జున్ కాంబినేషన్. త్వరలోనే ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేస్తూ విజయాలు అందుకుంటున్న దర్శకుడు విఐ ఆనంద్. సందీప్ కిషన్ హీరోగా ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఊరుపేరు భైరవకోన’. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో దర్శకుడు విఐ ఆనంద్‌కి.. అల్లు అర్జున్‌తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది.
దానికి విఐ ఆనంద్ సమాధానం చెబుతూ ‘బన్నీతో గతంలోనే ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. కొన్ని కథలు కూడా వినిపించడం జరిగింది. ఆ క్రమంలోనే ఒక సైఫై స్టోరీని కూడా ఆయనకు చెప్పాను. మరికాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉండే కథను రెడీ చేయమని చెప్పారు బన్నీ. అయితే అలాంటి కథను అప్పుడు రాయలేకపోయాను. కానీ, త్వరలోనే బన్నీని కలుస్తాను. మా కాంబినేషన్‌లో తప్పకుండా సినిమా ఉంటుంది. ఇక నా నెక్స్‌ట్ మూవీ గురించి చెప్పాలంటే గీతా ఆర్ట్స్‌లో నిఖిల్ హీరోగా సినిమా చేస్తున్నాను’ అని వివరించారు. డైరెక్టర్ విఐ ఆనంద్. కొత్త తరహా కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఆనంద్‌తో బన్ని సినిమా చేస్తే తప్పకుండా అది క్రేజీ కాంబినేషన్ అవుతుందని బన్ని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చెయ్యక తప్పదు.