హైదరాబాద్: జీవో 46 రద్దుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీసుశాఖ నియామకాల్లో ఈ జీవో రద్దు అంశం వివాదాస్పదంగా మారింది. భవిష్యత్‌లో జారీచేసే నోటిఫికేషన్లకు జీవో 46 అమలు చేయాలా? లేక రద్దు చేయాలా? అనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
జీవో 46పై ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి చర్చించారు. గత ప్రభుత్వం మార్చి 2022లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో నోటిఫికేషన్ జారీ చేసి సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతో పాటు, కొత్త పోస్టుల నోటిఫికేషన్ పై చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అక్టోబర్ 4, 2023కు ముందు 15,750 పోస్టులకు సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయింది. దాంతో పోలీసు శాఖలో సెలక్ట్ అయిన 15,750 మందికి నియామక పత్రాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని అధికారులు సీఎం రేవంత్ కు తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తయింది కనుక.. ఇప్పుడు జీవో 46 రద్దు చేయడం కొత్త వివాదాలకు తెరదీస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్లకు ఈ జీవో రద్దును అమలు చేయడం ఉత్తమమని సూచించారు.
మరిన్ని చూడండి