Wholesale inflation Rate In January 2024: దేశంలో ధరలు క్రమంగా దిగొస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2024 జనవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (wholesale price index (WPI) based inflation) రేటు 0.27 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో, అంటే 2023 డిసెంబర్‌లో ఇది 0.73 శాతంగా ఉంది. నెలవారీగానే కాదు, వార్షిక ప్రాతిపదికన కూడా WPI ఇన్‌ఫ్లేషన్ శాంతించింది. 2023 జనవరి నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు 4.8 శాతంగా నమోదైంది.
టోకు ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం (14 ఫిబ్రవరి 2024) నాడు విడుదల చేసింది.
WPI ద్రవ్యోల్బణం, 2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు నెగెటివ్ జోన్‌లోనే కొనసాగింది. ఆ తర్వాత నవంబర్‌లో పాజిటివ్ జోన్‌లోకి వచ్చి 0.39 శాతంగా నమోదైంది. అక్కడి నుంచి సానుకూలంగా మారింది.
జనవరిలో తగ్గిన ఆహార పదార్థాల ధరలు
ఈ ఏడాది జనవరిలో చిల్లర ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. ఆ నెలలో, సామాన్య ప్రజలకు ఊరటనిస్తూ దేశంలో ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. ఈ మార్పు హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ డేటాలో ప్రతిబింబించింది. టోకు ఆహార ద్రవ్యోల్బణం (Wholesale Food Inflation).. 2023 డిసెంబర్ నెలలోని 5.39 శాతం నుంచి 2024 జనవరి నెలలో 3.79 శాతానికి దిగొచ్చింది. కూరగాయల ద్రవ్యోల్బణం జనవరిలో 19.71 శాతంగా ఉంది, అంతకు ముందు డిసెంబర్ నెలలో 26.3 శాతంగా ఉంది. పప్పు దినుసుల ద్రవ్యోల్బణం జనవరిలో 16.06 శాతంగా ఉండగా, పండ్ల విషయంలో ఇది 1.01 శాతంగా ఉంది.
తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం (Manufacturing Products Inflation) జనవరిలో -1.15 శాతానికి మెరుగుపడింది, అంతకు ముందు డిసెంబర్ నెలలో ఇది -0.71 శాతంగా ఉంది.
ఇంధనం & విద్యుత్ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జనవరిలో -0.51 శాతానికి పెరిగింది. 2023 డిసెంబర్‌లో ఇది -2.41 శాతంగా ఉంది.
2023 నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం రేటు 0.26 శాతంగా ఉంది. జనవరి గణాంకాలు దాదాపు దీనికి దగ్గరగా ఉన్నాయి.
టోకు ద్రవ్యోల్బణమే కాదు, ఈ ఏడాది జనవరిలో చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation in January 2024) కూడా తగ్గింది. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ జనవరి నెలలో 5.10 శాతంగా నమోదైంది. ఇది దాదాపు మూడు నెలల కనిష్ఠ స్థాయి. 2023 డిసెంబర్ నెలలోని 5.69 శాతంతో పోలిస్తే జనవరిలో చాలా వరకు శాంతించింది. ఆహార పదార్థాల చిల్లర ద్రవ్యోల్బణం కూడా.. 2023 డిసెంబర్‌లోని 8.70 శాతం నుంచి 2024 జనవరిలో 8.3 శాతానికి దిగొచ్చింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో, దేశంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ప్రస్తుత జనవరి-మార్చి త్రైమాసికానికి ద్రవ్యోల్బణం లెక్కను సవరించింది, గత అంచనా 5.2 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో సగటు ద్రవ్యోల్బణం అంచనాను 4.5 శాతంగానే కేంద్ర బ్యాంక్ కొనసాగించింది.
మరోవైపు.. 2023 డిసెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతం వృద్ధి చెందిందని షనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) వెల్లడించింది.
మరో ఆసక్తికర కథనం: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారా?, ఎన్ని రకాల ఛార్జీలు కట్టాలో ముందు తెలుసుకోండి
మరిన్ని చూడండి