వాస్తవ సంఘటనల ఆధారంగా హృదయానికి హత్తుకునేలా రూపొందే సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. ‘కాశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ వంటి సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. ఇప్పుడు తెలుగులోనూ ఆ తరహా సినిమా రాబోతుంది. అదే ‘రాజధాని ఫైల్స్’. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భాను దర్శకత్వం వహించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తోనే తెలుగునాట సంచలనాలు సృష్టించింది. ఫిబ్రవరి 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు భాను.. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
– మామూలుగా నిర్మాతలు రిస్క్ చేయడానికి ఇష్టపడరు. కానీ మా నిర్మాత రవిశంకర్ గారు మాత్రం మొదటి సినిమాకే రిస్క్ చేయడానికి సిద్ధపడ్డారు. అందరిలా కాసులు తెచ్చే సినిమాలు కాకుండా.. సమాజానికి ఉపయోగపడే సినిమాలు, ప్రజలను చైతన్యపరిచే సినిమాలు తీయాలని ఆయన భావించారు. అందుకే మొదటి సినిమాగా ‘రాజధాని ఫైల్స్’ను నిర్మించారు.
– మొదట ఈ సినిమా చేయడానికి నేను కొంచెం ఆలోచించాను. మా కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా ఈ సినిమా చేస్తే అనవసరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. రిస్క్ చేయొద్దు అన్నారు. కానీ మా నిర్మాత సంకల్పం, ధైర్యం చూసి.. ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనిపించింది.
– ‘రాజధాని ఫైల్స్’ కోసం నేను ఎంతో రీసెర్చ్ చేశాను. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను, వారి కుటుంబాలని స్వయంగా వెళ్ళి కలిశాను. భూములు త్యాగం చేసినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? వారి త్యాగం వృధా అవుతుందని తెలిశాక వారు ఎంత ఆవేదన చెందారు? వంటి విషయాలను స్వయంగా వారి మాటల ద్వారానే తెలుసుకున్నాను. రాజధాని కోసం ఎందరో ప్రాణాలను కోల్పోయారు, ఎందరో పోలీసుల చేతిలో దెబ్బలు తిని ఆసుపత్రి పాలయ్యారు. ఇలా ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను మా సినిమాలో చూపించబోతున్నాం.
– రాజధాని అనేది ఒక ప్రాంతానికో, కొన్ని గ్రామాలకో సంబంధించిన సమస్య కాదు.. ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య. ఈ విషయం కొందరికి అర్థమవ్వడంలేదు. మా సినిమా ద్వారా ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పబోతున్నాం.
– దర్శకుడు అవ్వాలనే లక్ష్యంతో సినీ పరిశ్రమకు వచ్చిన నేను ఎన్నో కష్టాలను అనుభవించి ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగాను. దర్శకుడిగా పలు సినిమాలు తీశాను.. పలు అవార్డులు కూడా అందుకున్నాను. కానీ ఇప్పటిదాకా ఏ సినిమా ఇవ్వనంత సంతృప్తిని ‘రాజధాని ఫైల్స్’ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత నేను చనిపోయినా పరవాలేదు, ఇంతకంటే సాధించడానికి కూడా ఏమీలేదు అనే అంత సంతృప్తి కలిగింది.
– ఇది ఒక పార్టీకి అనుకూలంగానో, మరో పార్టీకి వ్యతిరేకంగానో తీసిన సినిమా కాదు. ఇదసలు రాజకీయ సినిమా కానే కాదు. ఇది ప్రజల సినిమా. రాజధాని కోసం భూములు త్యాగం చేసి, ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతుల కథ ఈ సినిమా. ప్రభుత్వం అనేది దైవంతో సమానం. అలాంటి ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు త్యాగం చేశారు. కానీ మరో ప్రభుత్వం వచ్చి ఆ రైతుల త్యాగాన్ని వృధా చేసింది. తాము అధికారంలోకి వస్తే అక్కడ రాజధాని ఉండదని ముందే చెప్తే.. అసలు రైతులు తమ భూములు త్యాగం చేసేవారు కాదు కదా. ఇది ఖచ్చితంగా రైతులకు జరిగిన అన్యాయమే.
– వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు రావడం సహజమే. కానీ నిజ జీవితంలో ఆ బాధను అనుభవించిన వారే.. తెర మీద తమ బాధను వ్యక్తపరచడం అరుదుగా జరుగుతుంది. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన నిజమైన రైతులు మా సినిమాలో 500 మందికి పైగా కనిపిస్తారు. నిజమైన రైతులతో చేసిన సినిమా కాబట్టే.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగా అనవసరమైన హంగుల జోలికి పోలేదు. లైటింగ్, ఫ్రేమింగ్ అంటూ సహజత్వాన్ని పోగొట్టే పని చేయలేదు. రైతుల బాధ నిజం. ఆ బాధని అంతే నిజాయితీగా, సహజంగా తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం.
– మా సినిమాలో రాజధాని సమస్య గురించి చర్చించడమే కాకుండా, దానికి తగిన పరిష్కారాన్ని కూడా చూపించాము. సినిమా అంతా ఒకెత్తయితే, పతాక సన్నివేశాలు మరోస్థాయిలో ఉంటాయి. మేము క్లైమాక్స్ లో చూపించిన పరిష్కారాన్ని నిజజీవితంలో ప్రజలు పాటిస్తే మాత్రం.. దేశంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉండదు.