Telangana Assembly: నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కీలక పదవి దక్కింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయనను నియమిస్తున్నట్లు బీజేపీ అధిష్టానం ప్రకటన చేసింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక బీజేపీఎల్పీ ఉపనేతలుగా వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్‌ను నియమించగా.. బీజేపీ శాసనమండలి పక్ష నేతగా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి అవకాశం కల్పించారు. అలాగే చీఫ్ విప్‌గా పాల్వాయి హరీష్ బాబు, విప్‌గా ధన్ పాల్ సూర్యనారాయణ, ట్రెజరర్‌గా పైడి రాకేష్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీగా రామారావు పాటిల్ నియమాకం అయ్యారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లను గెలుచుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా బీఏసీ సమావేశానికి తమ ఎమ్మెల్యేల్లో ఒకరిని పిలవాలని స్పీకర్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. ఈ సందర్బంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీఏసీ సమావేశానికి ఆహ్వానించాలని బీజేపీ ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసి ఓ లేఖను స్పీకర్‌కు అందించారు. దీంతో ఏలేటిని బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆయననే బీజేపీఎల్పీ నేతగా పార్టీ హైకమాండ్ నియమించింది. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆ పార్టీలో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 4 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, ముథోల్ నుంచి రామారావు పటేల్, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పాల్వాయి హరీష్ బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఆదిలాబాద్ నుంచి ఎక్కువ సీట్లు గెలవడంతో ఆ జిల్లాకు చెందినవారికి బీజేపీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావించింది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో రాజాసింగ్, ఏలేటి మినహా మిగతావారు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజాసింగ్ బీజేపీఎల్పీ నేతగా పనిచేశారు. అయితే వివాదాల కారణంగా రాజాసింగ్‌పై ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీ వేటు వేసింది. పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. తిరిగి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేసింది.
అయితే రాజాసింగ్ ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటారు. దీంతో గోషామహల్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన ఆయనకే బీజేపీఎల్పీ నేతగా అవకాశాలు ఉన్నాయి. కానీ రాజాసింగ్ వివాదస్పద నేత కావడంతో ఏలేటి వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఏలేటికి వివాదరహితుగా పేరుంది. పార్టీ నేతలందరితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా అందిరితో కలిసి మెలిసి ఉంటారు. ఏలేటికి బీజేపీఎల్పీ నేతగా అవకాశం కల్పించడానికి అది కూడా ఒక కారణంగా తెలుస్తోంది.
మరిన్ని చూడండి