ByMohan
Fri 16th Feb 2024 10:12 AM
తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ స్థానం హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడి పార్లమెంటు స్థానం పక్కాగా కాంగ్రెస్‌దే అనే భావన అందరిలోనూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు జిల్లాను క్లీన్ స్వీప్ చేయడమే దీనికి కారణం. పైగా ముగ్గురు మంత్రులు కూడా ఖమ్మం జిల్లా నుంచే ఉన్నారు. ఇప్పుడు అదే ముగ్గురు మంత్రులు ఖమ్మం సీటు కోసం పోటీ పడుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మొన్నటిదాకా మాజీ ఎంపీ రేణుకా చౌదరి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు రాజ్యసభ టిక్కెట్ ఇవ్వడంతో.. ఇప్పుడా రేస్ నుంచి రేణుక తప్పుకున్నారు. ఇక మిగిలింది ముగ్గురు మంత్రుల కుటుంబసభ్యులు. వాళ్ళల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇస్తుందన్నది సస్పెన్స్‌గా మారింది.
కాంగ్రెస్‌కు కంచుకోటగా ఖమ్మం..
తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ఖాతాలో ఖమ్మం జిల్లా నుంచి 9 స్థానాలు చేరాయి. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్‌కే దక్కాయి. ఆ తరువాత జిల్లా పూర్తిగా కాంగ్రెస్‌కు సొంతమైంది. ఉన్న అర కొర లీడర్లు సైతం దాదాపు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీ భావిస్తోంది. నిజానికి గతంలో ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ఇప్పుడు కూడా తన కంచుకోటను నిలబెట్టుకుంది. ఇక ఇప్పుడు ఖమ్మం పార్లమెంటు స్థానం హాట్ సీటుగా మారింది. ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి మల్లు నందినికి టికెట్ ఇప్పించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఖమ్మం నుంచి గాంధీ భవన్ వరకూ అనుచరులతో భారీగా కార్ల ర్యాలీ కూడా తీశారు.
పారిశ్రామికవేత్త రాజేంద్రప్రసాద్ కూడా..
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం టికెట్ అడుగుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీతో మంత్రి పొంగులేటి చర్చలు కూడా జరిపారు. ఇక ఆయన కూడా బల ప్రదర్శనకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ నెల 18న ప్రసాదరెడ్డి కుమారుడి రిసెప్షన్‌ను ఖమ్మం జిల్లా కల్లూరులో జరగనుంది. దీనికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనినే బలప్రదర్శనకు వేదిక చేసుకుంటున్నారు. ఖమ్మం ఎంపీ టిక్కెట్ రేసులో మిగిలింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకూ యుగంధర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు ఎంపీ టికెట్ దక్కించుకోవడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని యత్నిస్తున్నారు. ఇక వీరు మాత్రమే కాకుండా.. ఖమ్మంకు చెందిన పారిశ్రామికవేత్త రాజేంద్రప్రసాద్ కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరి వీరిలో టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
Khammam Lok Sabha Constituency In News:
Big Fight for Khammam Lok Sabha Constituency in Congress