న్యాయం గెలిచింది.. రైతుల ఆవేదనకు తెరరూపం ఇచ్చిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని కోసం కొన్ని వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతుల ఆవేదనను, ప్రభుత్వ అహంకార, అణచివేత ధోరణికి అద్దం పట్టేలా దర్శకుడు భాను రూపొందించిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. తెలుగు వన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాను గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్‌కి ముందే చాలా సెంటర్స్‌లో ప్రీమియర్ షోలు వేశారు. ఈ షోలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇక రిలీజ్ రోజు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ‘రాజధాని ఫైల్స్’ చిత్రంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గురువారం ఉదయం సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ‘రాజధాని ఫైల్స్’ చిత్రం ప్రదర్శనను నిలిపి వేశారు. కేసును పరిశీలించిన హైకోర్టు సినిమా ప్రదర్శనకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాపై వైసీపీ వెలిబుచ్చిన అభ్యంతరాలను కోర్టు త్రోసిపుచ్చింది. సినిమాను యధావిధిగా ప్రదర్శించుకునేందుకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ‘రాజధాని ఫైల్స్’ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో న్యాయమే గెలిచిందని ‘రాజధాని ఫైల్స్’ యూనిట్ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.