Minister Jupalli Krishnarao On Cag Report : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు వాస్తవమని తేలాయని, ఇందుకే రాజ్యాంగబద్దమైన సంస్థ కాగ్ ఇచ్చిన నివేదిక నిదర్శమని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో అవకతవకలను కాగ్ ఎత్తిచూపిందని తెలిపారు. ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరుకోకపోగా.. ఖజానాపై పెనుభారం మోపిందని కాగ్ ఆక్షేపించిన విషయాన్ని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లో ప్రయోజనాలు ఎక్కువ చేసి చూపి, ఖర్చులేమో తక్కువ చూపారని, కానీ వాస్తవంగా రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలే మాత్రమేనని కాగ్ స్పష్టం చేసిందన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలో ధరల పెరుగుదల వర్తింపు సహ పలు అంశాలను చూపకుండా ఆ తర్వాత పెంచారని కాగ్ ఎత్త చూపిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా గుత్తేదారులకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించారని అన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో గోల్ మాల్, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, ఆసరా పింఛన్ల పంపిణీలో అవకతవకలు, దుబారా ఖర్చులు.. స్థానిక సంస్థలు, రెవెన్యూ ఆదాయం వంటి అంశాలపై వేల కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు కాగ్ నివేదిక బహిర్గతం చేసిందని ప్రకటించారు.
గొర్రెల పంపిణీ పథకంలో ఇప్పటికే ఏసీబీ విచారణ కొనసాగుతుందని, ఈ పథకంలో వందల కోట్ల రూపాయాల అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదిక బహిర్గతం చేసిందన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలు చూస్తే విస్తుపోయేలా ఉన్నాయన్నారు. బైక్‌లు, కార్లు, అంబులెన్స్‌లు, ఆటోల్లో గొర్రెలను తరలించినట్లు కాగ్ నివేదిక పేర్కొందని, ఒకే ట్రిప్‌లో 126 గొర్రెలను బైక్ పై తరలించినట్లు, ఒకే ట్రిప్పులో 84 గొర్రెల రవాణాకు అంబులెన్స్‌ను వినియోగించినట్లు, 126 గొర్రెలను రవాణా చేయడానికి ఆటోను ఉపయోగించినట్లు ఇలా ఎన్నో విషయాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గుర్తించారని వెల్లడించారు.
సీయం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని, విచారణ కోనసాగుతోందని,.. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో జరిగిన వేల కోట్ల రూపాయాల కుంభకోణంపై జ్యుడిషీయల్ విచారణ జరుపుతామని సీయం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయంలో జరిగిన అవినీతిని కాగ్ ఎత్తిచూపిందని, ఆ రిపోర్టును మీరు చదివారా, దాని గురించి ఏం సమాధానం చెప్పుతారని
బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
కాగ్ రిపోర్టు ఆధారంగా బీఆర్ఎస్ హయంలో జరిగిన వేలాది కోట్ల అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతామని, తప్పు చేసిన ఏ ఒక్కరినీ కూడా వదలబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు మాట్లాడుతుందని ప్రజలు విశస్వసించారని, దీంతో కాంగ్రెస్ పార్టీపై విశ్వసనీయత పెరిగిందని తెలిపారు. కానీ ఇంకా బీఆర్ఎస్ నేతలు అదే అహంకారం, దౌర్జన్యం, దబాయింపు రాజకీయాలు అదే వైఖరిని కొనసాగిస్తున్నారని, ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని, చేసిన తప్పులను ఒప్పుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని, రాజకీయల్లో కొనసాగే నైతిక అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు, కాదు కూడదంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన బుద్ది చెప్పుతారని, ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకునే పరిస్థితి లేదన్నారు.
మరిన్ని చూడండి