Telangana Inter Practical Exams: తెలంగాణలో ప్రభుత్వం మారింది కానీ, పరీక్షల్లో తప్పులు మాత్రం కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో తప్పులు దొర్లాయి. అది కూడా చిన్న విషయంలో కాదు, ఏకంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి విషయంలో ప్రశ్నాపత్నం తయారు చేసినవారు తప్పులో కాలేశారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ పేపర్లో మాత్రం ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) అని రావడంతో అంతా షాకయ్యారు. సర్కార్ మారినా, ప్రశ్నాపత్రాల్లో తప్పులు మాత్రమే మారలేదని సెటైర్లు వేస్తున్నారు.
నవంబర్ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోగా, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో అధికారం మారి 2 నెలలు గడిచిపోయింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా.. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టారు. కానీ తాజాగా జరుగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో మాత్రం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అని ఓ ప్రశ్నలో ఇచ్చారు. ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క కాగా, హరీష్ రావును మంత్రిగా ప్రశ్నాపత్రం ముద్రించడం హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో ఎగ్జామ్స్ విషయంలో తప్పిదాలు జరిగాయని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కానీ నేడు అధికారం మారినా ఇంకా తప్పిదాలు దొర్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్ బోర్డు తీరుపై ఇంటర్ లెక్చరర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
మరిన్ని చూడండి